ఏందిరా ఈ పంచాయితీ రివ్యూ.. వింటేజ్ విలేజ్ డ్రామా!

Anilkumar
విలేజ్ వింటేజ్ డ్రామా, లవ్ స్టోరీలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి తరుణంలో ఓ చక్కటి ప్రేమ కథా చిత్రానికి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లను కలిసి ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన చిత్రం ఏందిరా ఈ పంచాయితీ. భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'.  ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
కథ
ఏందిరా ఈ పంచాయితీ అనే కథ అంతా కూడా రామాపురం గ్రామంలో జరుగుతుంది. ఆ ఊర్లో రకరకాల మనుషులుంటారు. ఓ ముగ్గురు స్నేహితులుంటార. అందులో ఎస్సై అవ్వాలని ప్రయత్నించే అభి( భరత్) కాస్త అల్లరిచిల్లర టైపు. తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆక్రమంలోనే ఊరి పెద్ద కూతురు యమున (విషికా)తో లవ్‌లో పడతాడు.  ఆ తరువాత అభి జీవితంలోవచ్చిన మలుపులు ఏంటి? హీరోయిన్ తండ్రిని చంపబోయిన కేసులో అభి ఎందుకు అరెస్ట్ అవుతాడు? అదే సమయంలో ఊర్లో మిగతా పెద్దలు అనుమానాస్పద మృతిలో చావడం? ఆ కేసులోనూ హీరో అభినే అరెస్ట్ చేయడం? ఆ తరువాత అభి వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? ఆ హత్యలు చేసింది ఎవరు? అభి తన ప్రేమను సాధించుకున్నాడా? చివరకు ఈ పంచాయితీ ఏమైంది? అనేది కథ.
నటీనటులు
అభి పాత్రలో భరత్ అద్భుతంగా నటించాడు. పాటల్లో డ్యాన్సులైనా, యాక్షన్ సీక్వెన్స్‌లో అయినా, కామెడీ సీన్లలో అయినా, ఎమోషనల్ సన్నివేశాల్లో అయినా చక్కగా నటించాడు. కొత్త వాడైనా కూడా ఆ బెరుకు ఎక్కడా కనిపించలేదు. ఇక విషికా నిజంగానే పల్లెటూరు అమ్మాయిలా ఎంతో అమాయకంగా, అందంగా కనిపించింది. ప్రేక్షకులను మెప్పించింది. తండ్రి పాత్రలో కాశీ విశ్వనాథ్ ఎమోషనల్ రోల్‌ను పోషించాడు. సుధాకర్‌గా రవి వర్మ ఆకట్టుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర, ఊరి పెద్దల పాత్రలు గుర్తుంటాయి. హీరో స్నేహితుల కారెక్టర్లు సినిమా ఆసాంతం నవ్విస్తాయి.
విశ్లేషణ
వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి జానర్లకు కాసింత సస్పెన్స్, కాసింత థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను జోడించాడు దర్శకుడు గంగాధర.టి. బోర్ కొట్టించని సన్నివేశాలతో సినిమాలను అలా చక్కగా ముందుకు తీసుకెళ్లాడు. మాటలు, పాటలు సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి. కథలో కొత్తదనం లేకపోవడం కాస్త నిరాశ పర్చినా.. కథనంతో నెట్టుకొస్తాడు. ప్రథమార్థంలో అసలు కథను మొదలుపెట్టలేదు. ఇంటర్వెల్‌కు హీరోని పోలీసులు పట్టుకెళ్లడంతో కథలో ఆసక్తి పెరుగుతుంది.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగుతుంది. హీరో, అతని గ్యాంగ్ చేసే చిల్లర దొంగతనాలు.. అల్లరి పనులు, హీరో హీరోయిన్ల ట్రాక్ బాగుంటుంది. సెకండాఫ్ అంతా కాస్త సీరియస్ టోన్‌లో వెళ్తుంది. క్లైమాక్స్ వచ్చే సరికి ట్విస్టులు రివీల్ అవుతుంటాయి. అసలు ఆ ఊర్లో జరిగే సంగతులన్నీ కూడా చివర్లోనే బయటపడతాయి. చివరి వరకు బిగి సడలకుండా గ్రిప్పింగ్ కథనాన్ని రాసుకున్నాడు దర్శకుడు. అక్కడక్కడా కాస్త నెమ్మదించిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.
టెక్నికల్‌గా ఏందిరా ఈ పంచాయితీ చిత్రం మెప్పిస్తుంది. కెమెరాపనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. మాటలు మెప్పిస్తాయి. పాటలు అలరిస్తాయి. నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి. కొత్త టీంతో కొత్త నిర్మాత ప్రదీప్ కుమార్.ఎం మంచి ప్రయత్నం చేసి సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది.
రేటింగ్ : 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: