తెలుగును పట్టించుకోని తమిళ సినిమా !
భాషా అభిమాన విషయంలో తమిళలు వారి భాషను ప్రేమించినంతగా తెలుగు ప్రజలు వారి భాషను ప్రేమించలేకపోతున్నారు అన్నది వాస్తవం. ఒకప్పుడు తెలుగులోకి వచ్చే తమిళ డబ్బింగ్ సినిమాలకు ఆ సినిమాలకు సంబంధించిన టైటిల్ విషయంలో పూర్తిగా తెలుగు టైటిల్స్ ను మాత్రమే అనుసరించే వారు.
అయితే రానురాను ఆ పద్ధతిని విడిచి పెట్టి తెలుగులో డబ్ అవుతున్న తమిళ సినిమాలకు తెలుగు టైటిల్స్ పెట్టకుండా తమిళ టైటిల్స్ తోనే విడుదల చేస్తూ ఉండటం చాలామందికి షాక్ ఇస్తోంది. మన తెలుగు ప్రేక్షకులు తమిళ టైటిల్స్ తో ఉన్న సినిమాలను విశాల హృదయంతో ఆదరిస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ‘లియో’ సినిమాలోని ఒక పాటకు రాసిన తెలుగు పదాలను చూసి తెలుగు వారు షాక్ అవుతున్నారు.
తమిళ డబ్బింగ్ సినిమాలలో హీరోలు చెప్పే డైలాగ్స్ లోని తెలుగు పదాలు చాల కొత్తగా వినిపిస్తున్నాయి. ఎవరో ఒక అనువాదకుడుని పెట్టుకుని అతడు వ్రాసే లోప భూయిష్టమైన తెలుగు డైలాగ్స్ వెండితెర పై విజయ్ రజనీకాంత్ లాంటి మాస్ హీరోలు చెబుతూ ఉంటే ఆ తెలుగు పదాలు ఎక్కడ నుంచి వచ్చాయి అన్న ఆలోచన కూడ లేకుండా తమిళ డబ్బింగ్ సినిమాలను నేటి యూత్ విపరీతంగా చూస్తూ ఉండటంతో చాల డబ్బింగ్ సినిమాలు తెలుగులో విజయవంతంగా ప్రదర్శింప పడుతున్నాయి అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి.
దీనితో తమిళ నిర్మాతలకు తెలుగులో తమ సినిమాల టైటిల్స్ ను ఆలోచించి పెట్టడానికి తమిళ నిర్మాతలకు సమయం దొరకడం లేదా లేదంటే తెలుగు ప్రేక్షకుల పై అంత నమ్మకమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘వలిమై’ ‘అయలాన్’ ‘ఊల్ఫ్’ అన్న తమిళ పేర్లతో తెలుగులో కూడ డబ్బింగ్ సినిమాలు వస్తూ ఉండటంతో తెలుగు భాష పరిస్థితి ఏమిటి అంటూ కొందరి ఆవేదన. ఇప్పటికే నేటితరం పిల్లలు తెలుగు మాట్లాడినా తెలుగు చదవలేని పరిస్థితులలో ఈ డబ్బింగ్ సినిమాల మ్యానియా తెలుగు విలువ మరింత తగ్గిపోయే ఆస్కారం ఉంది..