ఇప్పుడున్న జెనరేషన్లో లవ్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా ఉందనే విధంగా బేబీ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సాయి రాజేష్. ఫ్యామిలీ ఆడియన్స్ దీని పట్ల అంత సుముఖంగా లేనప్పటికీ యూత్ ఈ సినిమాకి విపరీతంగా కనెక్ట్ అయ్యారు. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన నిర్మాత SKN మూవీ ప్రమోషన్స్ లో 'కల్ట్ బొమ్మ' అనే పదాన్ని చాలాసార్లు వాడిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు అదే పేరుతో SKN ఓ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 'కల్ట్ బొమ్మ' అనే పేరుతో నిర్మాత SKN ఓ టైటిల్ ని ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించారు.
నిర్మాతగా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. బేబీ తర్వాత మరోసారి ఆనంద్ దేవరకొండ తో ఓ సినిమాని పట్టాలెక్కించారు. మరోసారి వైష్ణవి చైతన్య ఆనంద్ కి జోడిగా నటిస్తోంది. ఈ ప్రాజెక్టు తో పాటు సంతోష్ శోభన్ తోనూ ఓ సినిమాని ప్లాన్ చేశారు. బిగ్ బాస్ బ్యూటీ హారిక ఈ మూవీతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతోంది. బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ అందిస్తుండడం విశేషం. అయితే ఈ రెండు సినిమాల్లో SKN 'కల్ట్ బొమ్మ' అనే టైటిల్ ని ఏ సినిమాకు ఫిక్స్ చేశారో తెలియాల్సి ఉంది. బేబీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ప్లాన్ తో ఆనంద్ - వైష్ణవి కొత్త సినిమాకి ఈ పేరు ఫిక్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరి కల్ట్ బొమ్మ టైటిల్ ని ఏ ప్రాజెక్టుకు ఫిక్స్ చేశారనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. నిజానికి బేబీ మూవీ వచ్చిన తర్వాతే 'కల్ట్ బొమ్మ' అనే పదం బాగా వాడకంలోకి వచ్చింది. అలాంటి పదాన్ని తన సినిమాకి టైటిల్ గా SKN రిజిస్టర్ చేయించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు నిర్మాత SKN బేబి సినిమాని తమిళం తో పాటు హిందీలో రీమిక్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. స్వయంగా సాయి రాజేష్ హిందీ వెర్షన్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ రీమేక్‌లో బాబీ డియోల్ కుమారుడు ఆర్యమాన్‌ను పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయినే అనుకుంటున్నారు. అటు తమిళంలో శింబు, లవ్ టుడే హీరోయిన్ ఇవానా లతో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.