బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదలయ్యాడు. గ్రాండ్ ఫినాలే ముగిశాక జరిగిన ఘటనలకు సంబంధించిన కేసుల్లో అరెస్టైన రైతు బిడ్డకు శుక్రవారం (డిసెంబర్ 22) నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అయితే వరుసగా సెలవులు రావడంతో సోమవారమే పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదలవుతాడని చాలా మంది భావించారు. అయితే శనివారం (డిసెంబర్ 23) సాయంత్రమే చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఈ కేసు లో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీ హిల్స్ పోలీసులు ముందు హాజరు కావాలని పల్లవి ప్రశాంత్ ను ఆదేశించింది. మొత్తానికి నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న రైతు బిడ్డ బెయిల్ పై బయటకు రావడంతో అతని కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం కూడా చంచల్ గూడ జైలు దగ్గరకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే గ్రాండ్ ఫినాలే అనంతరం జరిగిన సంఘటనల నేపథ్యం లో జైలు నుంచి విడుదలైన ప్రశాంత్ కారులో ఎక్కి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు.బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట అభిమానుల మధ్య గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు పరస్పరం కొట్టుకున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అలాగే గ్రాండ్ ఫినాలే కు వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్ల పై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడు, అభిమానులపై కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసి 14 రోజుల నిమిత్తం చంచల్ గూడకు తరలించారు. అయితే శుక్రవారం నాంపల్లి కోర్టు రైతు బిడ్డకు మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చాడు.