హనుమాన్ మేకర్స్ సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ఓ డేరింగ్ స్టెప్ చేశారు. అదేంటంటే, రిలీజ్ కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేశారు. 'హనుమాన్' జనవరి 12న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో జనవరి 11న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. ఏపీ, తెలంగాణా లోని కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో మాత్రమే హనుమాన్ ప్రీమియర్స్ ని ప్రదర్శించబోతున్నారు. ఏపీలో అమలాపురంలో ఉన్న వీపీసీ కాంప్లెక్స్ లో రాత్రి 9 గంటల షో పడనుంది. వైజాగ్ జగదాంబ థియేటర్ లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.
జగదాంబ థియేటర్ లో అయితే అరగంటలోనే టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. దాదాపు వైజాగ్ లో పెయిడ్ ప్రీమియర్స్ కోసం ఓపెన్ చేసిన థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లోనూ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇప్పటికే అక్కడ కూడా బుకింగ్స్ ఫుల్ అయిపోయినట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ పరిధిలో ఉన్న మూసాపేట్, కూకట్ పల్లి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లోని థియేటర్స్ ని కూడా ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని థియేటర్స్ ని ఒకేసారి కాకుండా ఓ ప్లాన్ ప్రకారం బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు నిర్మాతలు.
ఇప్పటివరకు ఫస్ట్ షోస్ కు సంబంధించిన బుకింగ్స్ మాత్రమే ఓపెన్ చేశారు. జంట నగరాల్లో ఫస్ట్ షోలు ఫుల్ అయ్యాకే సెకండ్ షోల బుకింగ్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. నిజం చెప్పాలంటే రిలీజ్ కి ముందు ఇలా పెయిడ్ ప్రీమియర్స్ వెయ్యడం ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే పెయిడ్ ప్రీమియర్స్ తర్వాత సినిమాకి టాక్ బాలేదంటే రిలీజ్ రోజు నుంచే కలెక్షన్లు తగ్గిపోతాయి. గతంలో కొన్ని సినిమాలు ఇలాగే తొందరపడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. కానీ హనుమాన్ పై ఆడియన్స్ చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే సినిమాకి కాస్త పాజిటివ్ వస్తే చాలు 'హనుమాన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.