C.D మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ట్విస్టులు

Anilkumar
అదా శర్మ తెలుగులో నటించి చాలా కాలమే అవుతోంది. అదా శర్మ హీరోయిన్‌గా, విశ్వంత్ హీరోగా నటించిన చిత్రం C.D క్రిమినల్ ఆర్ డెవిల్. ఈ మూవీకి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
సిద్దు (విశ్వంత్) ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. అమ్మానాన్నలు ఊరికి వెళ్తే ఇంట్లో ఒక్కడే  ఉండాల్సి వస్తుంది. సిద్దు ఇంట్లో పని మనిషి (జబర్దస్త్ రోహిణి) అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. ఇక సిద్దుకి దెయ్యాలు అంటే చాలా భయం. అసలే సిద్దు భయస్థుడు. ఇక సిద్దు ఒంటరిగా ఉన్న ఆ టైంలోనే డెవిల్ అనే దెయ్యం సినిమా చూసి భయపడుతుంటారు. సినిమా చూస్తుంటే అందులోని దెయ్యం వచ్చి తననే చంపేస్తోందని భయపడుతుంటాడు. ఇలా సిద్దు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న టైంలోనే అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ లేడీ సైకో రక్ష (అదా శర్మ) బయట అందరిలోనూ భయాన్ని క్రియేట్ చేస్తుంది. పోలీసులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ మరీ
అందరినీ కిడ్నాప్ చేస్తుంటారు. అలాంటి రక్ష చివరకు విశ్వంత్ కోసం వచ్చి, అతని ఇంట్లోనే ఉంటుంది. విశ్వంత్‌కి ఉన్న సమస్య ఏంటి? రక్షగా అదా శర్మ ఎందుకు వచ్చింది? అసలు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంది ఎవరు? చివరకు పోలీసులు ఏం చేశారు? అన్నది కథ.

నటీనటులు
రక్ష పాత్రలో అదా శర్మ అందరినీ భయపెట్టేస్తుంది. ఆమె చూపుల్తోనే అందరిలోనూ వణుకు పుట్టించేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేస్తుంది. ఇక విశ్వంత్ అయితే తన వేరియేషన్స్ చూపించాడు. విశ్వంత్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇక ఇందులో రోహిణి అప్పుడప్పుడు కనిపించి తెగ నవ్వించేస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా భరణి మెప్పిస్తాడు. ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.
విశ్లేషణ
సి.డి సినిమా కోసం దర్శకుడు రాసుకున్న పాయింట్ కొత్తగా ఉంటుంది. హారర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలను కలగలపి కథను రాసుకున్నాడనిపిస్తుంది. అయితే ఈ చిత్రం అంతా ఒకే చోట జరుగుతుంది. దీంతో కథలో అంతగా ముందుకు సాగుతున్నట్టుగా అనిపించదు. కానీ గ్రిప్పింగ్‌గా తీసుకెళ్లడం, భయపెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కొన్ని ఇల్లాజికల్ సీన్లలా అనిపిస్తాయి. కానీ వాటికి అర్థం చివర్లో తెలుస్తుంది. ఇంటర్వెల్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది.
సెకండాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్ని వేశాలు కొన్ని రొమాంటిక్‌గా అనిపిస్తే.. ఇంకొన్ని సార్లు హారర్ ఎలిమెంట్స్‌ని తలపిస్తాయి. ఇక మధ్య మధ్యలో రోహిణి పాత్ర చేసే కామెడీ నవ్విస్తుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. నగరంలో అమ్మాయిల మిస్సింగ్‌ విషయంలో చివరన ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎండింగ్‌లో అందరూ ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.
సి.డి సినిమాకు ప్రధాన బలం సంగీతం. మూడ్‌కు తగ్గట్టుగా నవ్వించాడు. భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చక్కగా ఉంది. తక్కువ లొకేషన్లలో సినిమా తీసి మంచి అవుట్‌ను నిర్మాతకు అందించారు. ఈ మూవీ మరీ ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్‌ను కట్టి పడేసేలా ఉంది.
రేటింగ్ 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: