సాధారణంగా ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టినప్పుడు లేదంటే అమ్మాయి పుట్టినప్పుడు బాగా కలిసొస్తోందంటారు. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టిందని, ఇల్లు కళకళలాడుతోందని, కష్టాలన్నీ తొలిగిపోయాయని కుటుంబ సభ్యులు గర్వంగా, ఆనందంగా చెబుతుంటారు. అన్నీ శుభశకునాలే జరుగుతున్నాయనే మాట కూడా వింటుంటాం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి కూడా అన్నీ కలిసొస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మనవరాలు క్లింకార కొణిదెల వారి కుటుంబానికి అదృష్టదేవతగా మారిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.గతేడాది జూన్ 20వ తేదీన క్లింకార కొణిదెల రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జన్మించింది. క్లింకార భూమిమీదకు రావడానికి కొద్దిరోజులు ముందు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది. క్లింకార జన్మించిన తర్వాతే ఆమె బాబాయ్ వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నాడు.2023 నవంబరు ఒకటో తేదీన వీరి పెళ్లి ఇటలీలో వైభవోపేతంగా జరిగింది. మనవరాలు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాతే చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ఆయనకు ప్రదానం చేసింది. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీచేసి 70వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. జనసేన పార్టీ పోటీచేసిన 21 నియోజకవర్గాల్లోను గెలుపొంది రికార్డు నెలకొల్పింది. మెగా ప్రిన్సెస్, మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా క్లింకార మారిందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ పాపను సోషల్ మీడియాకు దూరంగా పెంచాలని రామ్ చరణ్, ఉపాసన దంపతులు నిర్ణయించారు. అందుకే ఆమెకు సంబంధించి ఏ ఒక్క ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయలేదు.