10 ఏళ్ల గ్యాప్ వచ్చినా.. చిరుకి తిరుగులేదనడానికి ఇదే సాక్ష్యం!
కొన్ని దశాబ్ధాలుగా పరిశ్రమను ఏలిన ఈ నటుడు పదేళ్ల పాటు గ్యాప్ తీసుకుని మరీ పునరారంగేట్రంలో సత్తా చాటాడు అంటే అది అతని స్టామినాకి ఓ మచ్చుతునక మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి 80వ దశకం ప్రారంభంలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లతో తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. 90వ దశకంలో అయితే బ్యాక్ టు బ్యాక్ సూపర్హిట్లను అందించి తెలుగు చిత్రసీమలో టాప్ హీరోగా వెలుగొందారు. ఈ క్రమంలో భారతదేశంలో బెస్ట్ డ్యాన్సర్ గాను చిరంజీవి పేరు దేశం అంతటా మార్మోగింది. సెప్టెంబరు 1992లో స్టార్డస్ట్ మ్యాగజైన్ చిరంజీవిపై బిగ్గర్ దేన్ బచ్చన్ అనే శీర్షికతో కవర్ స్టోరీని ప్రచురించగా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే ఆ సమయంలో చిరంజీవి తెలుగు సినిమా ఆపద్బాంధవుడు కోసం 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా అవతరించారు. దీనితో ఒకే సినిమాకు రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ సంపాదించిన మొదటి భారతీయ నటుడిగా చిరంజీవి చరిత్రలో నిలిచారు. అప్పటికి బాలీవుడ్ యాంగ్రీ మెన్ అమితాబ్ బచ్చన్ ఒక్కో సినిమాకు రూ.90 లక్షల లోపే తీసుకొనేవారట. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఖైదీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లాంటి మ్యాసివ్ బ్లాక్బస్టర్లతో చిరు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. 2008లో రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చి తిరిగి తెరపైకి వచ్చినప్పటికీ తనకు ఫాలోయింగ్ చెక్కు చెదరలేదని నిరూపించారు.