సినీ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అని అంతా అంటుంటారు. అయితే ఇక్కడ ఏదైనా అవకాశాలు దక్కించుకోవాలన్నా, స్టార్ డమ్ పొందాలన్నా ఏవీ అంత ఈజీగా రావు. ప్రస్తుతం స్టార్లుగా ఉన్న వారంతా తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అధిగమించి, అవమానాలను పొంది ఈ స్థాయికి వచ్చిన వారే. అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ షాలినీ పాండే ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్, శర్వరీ వాఘ్లు నటించిన 'మహారాజ్' చిత్రంలో షాలినీ పాండే కీలక పాత్ర పోషించింది. తన కొత్త సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
కాస్టింగ్ కౌచ్ లేదా బాడీ షేమింగ్ అనేది దాదాపు ప్రతి నటికి ఎక్కడో ఒక చోట ఎదురయ్యే చేదు అనుభవం. ఇలాంటి చేదు అనుభవం తనకు కూడా ఉందని నటి షాలినీ పాండే పేర్కొన్నారు. తాను సౌత్ సినిమాల్లో నటించే సమయంలో తనకు అక్కడి భాష తెలియదన్నారు. దీంతో తనకు మేనేజర్లుగా పని చేసిన వారు దీనిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించే వారన్నారు. ఇక తనను కూడా బాడీ షేమింగ్ చేశారని ఆమె వాపోయారు. సినిమాల్లోకి రాక ముందు ఇలా ఎన్నో సార్లు తిరస్కరణకు గురయ్యానన్నారు. కానీ ప్రస్తుతం అదే వ్యక్తులు తనను హాట్ అండ్ బోల్డ్ అని పిలుస్తున్నారని పేర్కొన్నారు. తాను అథ్లెటిక్ బాడీ అయినప్పటికీ తన గురించి అవమానకరంగా బాడీషేమింగ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎదురయ్యే సమస్యలను పక్కన పెట్టి, ప్రేక్షకులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించే దానిని ఆమె చెప్పారు.
ఇక సినిమాల్లో నటించేందుకు తాను ఇంట్లో వాళ్లను ఒప్పించేందుకు నాలుగు సంవత్సరాలు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. తాను ఇంజినీరింగ్ చేయాలని తన తండ్రి భావించారన్నారు. అయితే తనకు అది ఇష్టం లేదన్నారు. ఇంట్లో వారు అంగీకరించకపోవడంతో సినిమాలపై ఇష్టంతో చివరికి ముంబై వచ్చేశానని తెలిపారు. అయితే ముంబైలో తనకు ఎవరూ తెలియదని, తెలిసిన వాళ్ల వద్ద ఉండలేకపోయానని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను అబ్బాయిలతో కలిసి రూమ్ షేర్ చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే తనను వారు ఓ కుటుంబ సభ్యురాలిగా, స్నేహితురాలిగా చూసుకున్నారని వివరించారు. వారు తనకు కుటుంబంలా మారారని చెప్పారు. ఇప్పటికీ వారితో తనకు మంచి స్నేహం ఉందని ఆమె తెలిపారు.