ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బెల్లం కొండ శ్రీనివాస్. తన దైన డ్యాన్స్ లు, ఫైట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సుమారే పదేళ్ల క్రితం వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీనివాస్. మొదటి సినిమాతోనే మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, ఛత్రపతి (హిందీ) సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా రాక్షసుడు, జయ జానకి నాయక సినిమాల్లో శ్రీనివాస్ నటనకు చాలా మంచి పేరొచ్చింది. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి గురువారం (జులై 25) తో పదేళ్లు పూర్తయ్యింది. 2014 జులై 24న బెల్లం కొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శ్రీను రిలీజైంది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో తన పదేళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇదే సందర్భంగా తన మంచి మనసును చాటుకుంటూ అంధులకు ఆహారం, బట్టలు పంపిణీ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా, అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.ఆ ఫోటోల కిందఈ విధంగా రాసుకొచ్చాడు. ‘తాను సినీ ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లలో ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఇక నా సినిమాలను ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నా సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.ఇలా వారి సహకారమే ఎప్పుడూ నన్ను నిలబడేలా చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అందుకే నాకెంతో ఇచ్చిన ఈ సమాజానికి ఇలాంటి అద్భుతమైన రోజున ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది. ఈ క్రమంలోనే ఈ ఆనందాన్నిఇలా పంచుకుంటున్నాను. మీ దీవెనలు, సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు.ఇలా అంధుల పాఠశాలలో అక్కడి పిల్లలతో కలిసి సందడి చేశాడు. వారికి స్వయంగా చేత్తో వడ్డించాడు. పిల్లలకు బట్టలు, పుస్తకాలు పంపిణీ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇలా తన మంచి మనసుని చాటుకున్న హీరోని చూసిన నెటిజన్లు.. బెల్లంకొండ కాదు.. బంగారు కొండ అని కామెంట్లు చేస్తున్నారు. టైసన్ నాయుడు అంటూ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. వరుస ప్రాజెక్టులతో బెల్లంకొండ శ్రీనివాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.