మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ రవితేజ రీసెంట్ టైమ్ లో నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కొంత కాలం క్రితం రవితేజ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత రవితేజ "కిలాడి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రవితేజ ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ , టైగర్ నాగేశ్వరరావు , ఈగల్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. తాజాగా రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో రవితేజ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రవితేజ మాట్లాడుతూ ... నేను హిట్ , ఫ్లాప్ ల గురించి ఏ మాత్రం పట్టించుకోను. సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆ మూవీ కోసం నేను ఎంత చేయాలో అంత చేస్తాను.
సినిమా మొత్తం పూర్తి అయ్యి జనాల్లోకి వచ్చిన తర్వాత దాన్ని మనం ఏమీ చేయలేం. దాన్ని రిజల్ట్ ను చూడడం తప్ప. అందుకే నేను సినిమా హిట్టు , ఫ్లాప్ గురించి పెద్దగా పట్టించుకోను. అలాగే సినిమా మొదలయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన ఏమీ చేయలేం. అప్పటికే ఆ సినిమాపై నిర్మాతలు చాలా మొత్తం ఖర్చు పెట్టి ఉంటారు. అలాంటి సమయంలో ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేయవలసిందే. అలా విడుదల చేయడం ద్వారా ఎంతో కొంత నిర్మాతలకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది అని రవితేజ తాజాగా చెప్పుకొచ్చాడు.