పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆ పేరు వింటే ఒక వైబ్రేషన్. అది సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా.. సినిమాల్లోకి రాకముందు చిరంజీవి తమ్ముడిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కొణిదల కల్యాణ్ ఆ తర్వాత తన పవర్ ఏమిటో చూపి పవన్ కల్యాణ్‌గా మారారు. ఏపీ డిప్యూటీ సీఎం, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా సోషల్ మీడియా అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు. ‘కళ్యాణ్ బాబు... ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. దీర్ఘాయుష్మాన్ భవ!’ అని పోస్ట్ వేశారు.పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్‌ను రీ రిలీజ్ చేస్తూ అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బుకింగ్స్‌తోనే ఐదు కోట్ల గ్రాస్‌కు పైగా వసూల్ చేయడంతో కొత్త రికార్డులు సృష్టించినట్టు అయింది.ఈ నేపథ్యంలోపవన్ కల్యాణ్ నటిస్తున్న 3 సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. ‘ఓజీ’ పాటకు సంబంధించిన అప్ డేట్ రావాలి. కానీ ఆంధ్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి హడావుడీ చేయకూడదని ఓజీ టీమ్ నిర్ణయం తీసుకొంది. ‘ఉస్తాద్’ నుంచి కూడా ఎలాంటి అప్ డేట్ ఉండకపోవొచ్చు. ‘హరి హర వీరమల్లు’ టీమ్ ఓ చిన్న సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంది.