చియాన్ విక్రమ్.. వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు. పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేస్తాడు. అందుకోసం తన లుక్ ను ఎలా అంటే.. అలా ఛేంజ్ చేసుకుంటాడు. ఈ విషయం శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. ఇటీవలే ‘తంగలాన్’ అనే ప్రయోగాత్మక మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వరుసగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.2001లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన 'కాశీ' మూవీ విక్రమ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో ఆయన అంధుడిగా నటించారు. ఉత్తమ నటుడిగానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించడం వల్ల కొన్ని సమయాల్లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ మూవీ షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ''సినిమాల్లో పాత్రకు అవసరమైనట్లు మారడం, నటించడమంటే నాకు ఇష్టం. ఇతరులతో పోలిస్తే, ఏదైనా ప్రత్యేకంగా చేయాలి. అది అందరూ చేసినట్లు ఉండకూడదు. నేను మందు తాగను, సిగరెట్ కాల్చను. కానీ, సినిమా పట్ల నాకున్న అభిరుచి నాకు విషంలాంటిది. నేను బాగా నటించాలని అనుకున్నప్పుడు అది మరింత ఎక్కువ విషంగా మారుతుంది. నేను 'కాశీ' (తెలుగులో శ్రీను, వాసంతి, లక్ష్మి) అనే మూవీ చేశా. అందులో నటించిన తర్వాత రెండు, మూడు నెలల పాటు నా కంటి చూపు మందగించింది. సరిగా చూడలేకపోయేవాడిని. ఎందుకంటే ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేది. ఆ ప్రభావం నా కంటి చూపుపై పడింది. మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు'' అంటూ కాశీ మూవీ పూర్తయిన తర్వాత తనకెదురైన పరిస్థితిని గుర్తుచేసుకున్నారు.