కొన్ని రోజుల క్రితం చర్చనీయాంశంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు లో పోలీసులు ఫైనల్‌గా ఛార్జిషీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతోపాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని వివరించారు. పోలీసులు చార్జీషీట్లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు.రేవ్ పార్టీ కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో నటి హేమను సస్పెండ్ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టులో హేమపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.ఈ నేపథ్యంలో మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు నిర్దారించారు. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హేమ వెళ్లలేదు. హేమ మొదట బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనప్పటికీ.
తాను వెళ్లలేదంటూ పలు వీడియోలు కూడా విడుదల చేసింది. కానీ పోలీసులు రిలీజ్ చేసిన హేమ ఫొటోలోని డ్రెస్, హేమ విడుదల చేసిన వీడియోల్లోని డ్రెస్ ఒకే విధంగా ఉండటంతో ఆమె పార్టీకి వెళ్లినట్టు నిర్దారణకు వచ్చారు.ఇదిలావుండగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు గతంలో ఎలా అయితే పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేశారో.. అదే పాత వార్తలను తీసుకువచ్చి మళ్లీ ప్రచురిస్తున్నారు. హేమకు పాజిటివ్ వచ్చింది అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ నేనే ఇంకా చూడలేదు. మీరు ఎలా చూశారు అంటూ మీడియాపై మండిపడింది హేమ. తానే స్వయంగా మీడియా పెద్దల వద్దకు వస్తానని.. వారే టెస్ట్ చేయించాలని హేమ సవాల్ విసిరారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షైనా అనుభవిస్తానని నెగిటివ్ వస్తే తనకు న్యాయం చేయాలన్నారు. పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమని హేమ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.