దేవర : ఇక చూస్తారు రామారావు ఆడించే ఆట... !
ఎన్టీఆర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దిగుతోంది అంటే బాక్సాఫీస్ కచ్చితంగా షేక్ అయిపోతుంది. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాకు.. రెండు తెలుగు రాష్ట్రాలు గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్‌కు కాస్త గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వం దేవరకు టికెట్ రేట్ల పెంపుతో పాటు.. అదనపు షోలకు అనుమతి ఇస్తుందా.. అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం దేవర స్పెషల్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చేసింది.
సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్లలో వేసుకోవచ్చు. 28వ తేదీ నుంచి తొమ్మిది రోజులపాటు అంటే అక్టోబర్ 6వ తేదీ వరకు ప్రతిరోజు ఐదు ఆటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ‘దేవర’ టికెట్ రేట్లు కూడా భారీగా పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. మల్టీఫ్లెక్స్‌ల్లో ఏకంగా రూ.135 పెంచుకుంటారు. మల్టీఫ్లెక్స్‌లో టికెట్ ధర రూ.177 ఉంది.
ఇప్పుడు దేవర టికెట్ రేట్ రూ.312 వరకు ఉంటుంది. ఇక సింగిల్ స్క్రీన్లలో అప్పర్ క్లాస్‌కు రూ.110, లోయర్ క్లాస్‌కు రూ.60 వరకు పెంపునకు అనుమతి ఇచ్చారు. కాబట్టి సింగిల్ స్క్రీన్లలో కూడా ‘దేవర’ టికెట్ ధర రూ.200 పైనే ఉంటుంది. తెలంగాణలో పెంపుపై ఇప్పటికే ఓకే చెప్పినా ఇంకా అధికారిక ఉత్తర్వులు రాలేదు. రెండు రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు పెరిగిపోవడంతో ఇక రామారావు రప్ఫాడించేస్తాడనే చెప్పాలి.