విశాఖ సాగర తీరంలో మరో మణిహారం చేరబోతోంది. సాగర తీరంలో టీసీఎస్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.అందాల విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ మణిహారంగా మెరవనుంది. మెరుగైన జీతభత్యాలు అందించే 10 వేల ఐటీ ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి.యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్, ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా విశ్వప్రయత్నాలు చేసి టాటా గ్రూపు చైర్మన్, పెద్దలను ఒప్పించి విశాఖకు టీసీఎస్ ని రప్పించారు. ముంబై మహానగరంలోని టాటా సన్స్ ఆఫీస్ బాంబే హౌస్ లో టాటా సన్స్ చైర్మన్ ఎం చంద్రశేఖరన్‌తో మంగళవారం ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎంవో అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ అధికారులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, విశాఖలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు. వెంటనే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ తమ సెంటర్‌ను విశాఖలో నెలకొల్పుతామని, 10వేల ఉద్యోగాలు కల్పిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీ, ఎయిరో స్పేస్, స్టీల్, హోటల్స్, టూరిజం రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు పరిశీలిస్తామని టాటా గ్రూప్ మంత్రి నారా లోకేష్‌కి వివరించింది.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖలో ఏర్పాటుచేసి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్రఖ్యాత కంపెనీలను స్వాగతిస్తోందన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపేందుకు టీసీఎస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి తొలి అడుగు కానుందని హర్షం ప్రకటించారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో దూసుకెళ్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీఎం ఆదేశాలతో, తాను యువతకి-రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట మేరకు మంత్రి నారా లోకేష్ ప్రఖ్యాత కంపెనీలను రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేసి విజయవంతం అయ్యారు. లులూ, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి…ఇప్పుడు లోకేష్ ఐటీ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ కానున్న టాటా గ్రూప్‌ని ఒప్పించి మెప్పించి టీసీఎస్ రప్పించారు. టీసీఎస్ రాకతో ఐటీ హబ్‌గా విశాఖ, ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.ఈ నేపథ్యంలో బిజినెస్ చేసేందుకు ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో.. టీసీఎస్ ద్వారా ఈ పెట్టుబడి ఓ కీలక మైలు రాయి అని పేర్కొన్నారు.