గుమ్మడి: ఎన్టీఆర్కు ఏదైనా జరిగుంటే జీవితాంతం బాధపడేవాడిని.!

FARMANULLA SHAIK
తెలుగు చిత్ర సీమలో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు. ఐదొందలకు పైగా చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు గుమ్ముడి..ఈయన తన నటనకు గాను రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు. తనకంటే పెద్ద వారైన నటులకు కూడా తండ్రిగా నటించిన గుమ్మడి..ఎలాంటి పాత్రలనైనా చాలెంజింగ్ గా తీసుకుని నటించేవారు.అయితే తన కెరీర్‌లో జరిగిన అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గుమ్మడి అందులో సీనియర్‌ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుతో అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ”. ఓ సారి చిరంజీవులు అనే చిత్రంలో నేను, రామారావు కలిసి నటిస్తున్నాం. ఆ సినిమా షూటింగ్‌లో ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పింది.
ఆ సినిమాలో అందుడిగా నటిస్తున్న ఎన్టీఆర్‌ పట్టాల మీద నడిచే సన్నివేశం ఒకటి వుంది. అలా ఆయన పట్టాల మీద నడుస్తున్నప్పుడు వెనుక నుంచి రైలు వస్తుంటుంది. ఆఖరి క్షణంలో రైలు దగ్గరికి రాగానే నేను ఆయన్ని పట్టాల నుంచి పక్కకు తోసేయాలి. అదీ సీన్.. ఇప్పటి సాంకేతికత అప్పట్లో లేదు. ఎదైనా కాస్త రియాలిటీగా దగ్గరగా చేయాల్సిందే. ఎలక్ట్రిక్‌ రైలు వచ్చే పట్టాలపై షూటింగ్‌ను ప్లాన్‌ చేశారు. చిత్రీకరణ జరుగుతోంది. వెనక నుంచి రైలు వస్తోంది.
అనుకోకుండా బూటు జారిపోయి నేను పడిపోయాను. అది గమనించకుండా రామారావు క్యారెక్టర్‌లో లీనమైపోయి నడుస్తున్నాడు. పడిపోయిన నేను లేచివెళ్లి ఆయనకు పక్కకు నెట్టేశాను. నిజంగా ఆ రోజు గుర్తుచేసుకుంటే మళ్లీ నాకు ఒళ్లు జలదరిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు సీనియర్‌ నటుడు గుమ్మడి.ఇక గుమ్మడి-ఎన్టీఆర్ ల పరిచయం విషయానికొస్తే…వీరిరువురి పరిచయం ఓ హోటల్ లో జరిగింది. అది కాస్త స్నేహంగా మారడంతో ..సీనియర్ ఎన్టీఆర్ పిలిచి మరీ ఆయనకు తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు.అలా గుమ్మడి..ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్నారు. కానీ, గుమ్మడి ఎక్కువగా ఏఎన్ఆర్ సినిమాల్లో నటించడంతో ఆయనకు ‘అక్కినేని మనిషి’ అని ముద్ర పడింది. దాంతో ఎన్టీఆర్ ఆయనను దూరం పెట్టారు. తన కూతురు పెళ్లికి రావాలని సీనియర్ ఎన్టీఆర్ కు గుమ్మడి శుభ లేఖ ఇచ్చినప్పటికీ ఆ వివాహ వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాలేదు.అప్పటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య కాస్త విభేదాలు ఉన్నాయట. అయితే, ఎన్టీఆర్-ఏఎన్ఆర్ కలిసిపోయిన క్రమంలో గుమ్మడిని పట్టించుకోలేకపోయానని సీనియర్ ఎన్టీఆర్ బాధపడ్డారట. తెలుగు చిత్ర సీమకు రెండు కళ్లలాగా ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పటికీ ఉంటారని ఇప్పటికీ సినీ ప్రముఖులు చెప్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: