తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ఈ వి వి సత్యనారాయణ గారి కుమారుడు. నరేష్ "అల్లరి" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు రవిబాబు దర్శకత్వం వహించగా ... దగ్గుపాటి సురేష్ బాబు ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.
తాజా ఇంటర్వ్యూలో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... అల్లరి మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయింది. సినిమా విడుదల కూడా చాలా దగ్గరగా వచ్చేసింది. ఒక రోజు నేను డబ్బింగ్ చెప్పే రూమ్ దగ్గర ఉన్నాను. ఆ సమయంలో రవిబాబు వచ్చి నీ డబ్బింగ్ చెప్పావా అని అన్నాడు. నేను లేదు అన్నాను. దానితో వెంటనే ఆయన తొందరగా చెప్పు అని అన్నాడు ... వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత నేను అదే రోజు రాత్రి 11 గంటలకు సినిమా డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాను. ఇక ఉదయం 5 గంటల వరకు డబ్బింగ్ మొత్తం చెప్పేశాను.
6 గంటల్లో నేను ఆ మూవీ డబ్బింగ్ మొత్తం చెప్పాను. ఇక సురేష్ బాబు గారికి రోజు ఉదయం జాగింగ్ చేసే అలవాటు ఉంటుంది. ఆయన ఉదయం 5 గంటల సమయంలో నేను డబ్బింగ్ చెప్పే ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశంలో నన్ను చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. నేను డబ్బింగ్ చెప్పాను అని అన్నాను. కంప్లీట్ అయ్యిందా అన్నాడు. అయింది అన్నాను. ఇక ఆయన లోపలికి వెళ్లి నేను చెప్పిన డబ్బింగ్ చూసాడు. చూసి ఓకే అన్నాడు వెళ్ళిపోయాడు అని అల్లరి నరేష్ తాజాగా చెప్పుకొచ్చాడు.