టాలీవుడ్: ఎమ్మెల్యే టికెట్ లాగా సినిమా టికెట్లు.. పేదోడి కడుపు కొట్టడమేనా.?
- పేదోడు సినిమా చూడాలంటే కడుపు మాడ్చుకోవాల్సిందే..
ఒకప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఏరా మావా సినిమాకి వెళ్దామా.. మన అభిమాన హీరో సినిమా థియేటర్లలోకి వచ్చింది అనుకొని చివరికి జేబులు తడుముకుంటే జేబులో పది రూపాయలు ఉన్న అందరి జేబులో కలిసి కనీసం 50 రూపాయలు ఉన్నా సినిమా చూసి వచ్చేవారు. ఆ విధంగా ఆనాటి రోజుల్లో సినిమా టికెట్ల నుంచి మొదలు అన్ని చౌకగానే దొరికేవి. అంతేకాదు సినిమాను చూసి ఎంతో ఎంజాయ్ చేసేవారు. కానీ ఆనాటి రోజులు ఈనాడు లేవు. ఆనాడు సినీ నిర్మాతలు హీరో హీరోయిన్లు అయినా సరే సినిమాకు సంబంధించి రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా, మనల్ని ఆదరించాలి వారికి మనం వినోదాన్ని అందించాలి అనే ఆలోచనతో ఉండేవారు. కానీ ఈనాటి రోజుల్లో మాత్రం హీరో నుంచి మొదలు డైరెక్టర్ వరకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుని పాన్ ఇండియా పేరుతో సినిమాలు రిలీజ్ చేసి, సినిమాలో కంటెంట్ లేకపోయినా హంగు ఆర్భాటాలు చేసి చివరికి ఆ ఖర్చు అంతా పేద మధ్య తరగతి ప్రజలపై వేసేస్తున్నారు. ప్రతి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకుంటూ అదనపు షో లు వేస్తూ పేద ప్రజలకు సినీ వినోదాన్ని దూరం చేస్తున్నారని చెప్పవచ్చు. సినిమా అంటే మనిషిని ఆనంద పరచాలి కానీ, సినిమా చూసొచ్చి అంత ఖర్చయిందని చెప్పేసి బాధపడకూడదు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఒక్కడు కూడా థియేటర్ కి వెళ్లి సినిమా చూడడమే కష్టంగా మారింది. అలాంటిది ఫ్యామిలీతో వెళ్తే పేద మధ్యతరగతి ప్రజలు ఒక నెల శాలరీలో సగం అటు పోవాల్సిందే. సినిమా టికెట్ల రేట్లు ఒక పార్టీ ఎమ్మెల్యే టికెట్లను ఏ విధంగా అమ్ముకుంటుందో ఆ విధంగా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
పార్టీ టికెట్లలా సినిమా టికెట్లు:
సాధారణంగా రాజకీయ పార్టీలో ఉండే నాయకులు అధికారంలోకి రాబోయే పార్టీ ఏదైనా ఉందని తెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లి డబ్బు వెచ్చించి మరీ ఎమ్మెల్యే టికెట్లను తెచ్చుకుంటూ ఉంటారని మనం వింటుంటాం. ఇంత ఖర్చైనా టికెట్ కొనుక్కొని డబ్బులు ఖర్చు పెట్టుకుని చివరికి ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ మన పైనే వసూలు చేస్తారు. ఆ విధంగా పార్టీ నాయకులు ఎలా ప్రవర్తిస్తారో ప్రస్తుతం సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్లు అలాగే తయారయ్యారని సినిమా చూసే జనాలు మాట్లాడుకుంటున్నారు.. భారీ బడ్జెట్ పేరుతో సినిమాలు రిలీజ్ చేసి ఆ భారాన్ని పేద మధ్యతరగతి ప్రజలపై రుద్దుతున్నారు. అదనపు షోల పేరుతో టికెట్ల రేట్లు పెంచి, పేద మధ్యతరగతి ప్రజల టికెట్లు గల్లంతు చేస్తున్నారు. సినిమా అంటే ఆనందాన్ని అందించడం అని ఒకప్పుడు ఉండేది. కానీ ప్రస్తుతం సినిమా అంటే డబ్బుంటేనే వెళ్లాలి అనే పరిస్థితి వచ్చింది. అలా రాజకీయ పార్టీ టికెట్స్ లాగా సినిమా టికెట్లను కూడా విపరీతమైన రేట్లకు అమ్ముకుంటూ దర్శక నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు.