టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో కొరటాల శివ ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాల పాటు చాలా సినిమాలకు కథ రచయితగా పని చేసి సూపర్ సక్సెస్ అయిన తర్వాత దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈయన యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించిన మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను , ఆచార్య తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో ఆచార్య మూవీ ని మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.
ఇకపోతే తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా , కెరియర్ను కొనసాగిస్తున్న దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు మీరు మీ బ్యానర్ నుండి ఎంతో మంది దర్శకులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. మరి కొరటాల శివ కూడా మీ బ్యానర్లో దర్శకుడిగా కాకముందు చాలా సినిమాలకు పని చేశారు. మరి ఆయనను మీరు ఎందుకు దర్శకుడిగా పరిచయం చేయలేదు అనే ప్రశ్న దిల్ రాజు కి ఎదురయింది.
దీనికి దిల్ రాజు సమాధానం ఇస్తూ ... అసలు కొరటాల శివ మా బ్యానర్ నుండే దర్శకుడిగా పరిచయం కావాల్సింది. ఆయన రాసిన ఎన్నో కథలను నేను విన్నాను. ఆయనను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకున్నాను. కానీ అదే సమయంలో కొరటాల , యువి క్రియేషన్స్ వారితో కూడా క్లోజ్ అయ్యారు. ఆయన కథలను వారు విన్నారు. వారు కూడా ఓ నిర్మాణ సంస్థను స్థాపించాలి అనుకున్నారు. దానితో కొరటాల దర్శకత్వంలో వారు సినిమాను రూపొందించారు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.