సంక్రాంతి రేసులోకి కొత్త సినిమాలు.. ముగ్గుల పండుగ బరి ఒక్కసారిగా చేంజ్..?
సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగలు వస్తున్నాయంటే చాలు నిర్మాతలు వెంటనే ఆ పండుగకు ముందు తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించేస్తుంటారు. కొంతమంది నిర్మాతలైతే కొన్ని ఏళ్లకు ముందే ఫెస్టివల్ సందర్భంగా తమ మూవీ రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటిస్తారు. ఒక రిలీజ్ డేట్ ఖరారు చేసుకుని వేరే వాళ్లు పోటీకి రాకుండా జాగ్రత్త పడతారు. పండుగ సందర్భంగా కలెక్షన్లు అన్నీ సొంతం చేసుకోవాలని భావిస్తారు. కొన్ని సినిమాల నిర్మాతలు వీరికి పోటీగా తమ సినిమాలను బరిలోకి దింపి షాకులు ఇస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో విపరీతమైన పోటీ నెలకొంటుంది. ఈ సారీ అదే పరిస్థితి రిపీట్ కానుంది.
సంక్రాంతి సమయంలో రిలీజ్ చేస్తే యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా హిట్ రేంజ్ లో కలెక్షన్లు రాబడతాయి. పండగ పూట చాలామంది ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా థియేటర్లకు రావడానికి ఇష్టపడడమే ఇందుకు కారణం. ఈ సమయంలో మంచి టాక్ తెచ్చుకుంటే ఆ మూవీ మరింత ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది. అందులో నటించిన వాళ్లు సూపర్ స్టార్లు అయిపోతారు. సంక్రాంతి సీజన్ అనేది సినిమా వాళ్లకి చాలా కలిసొచ్చే కాలం. అందుకే దీన్ని ఎవరూ వదులుకోరు. కొన్ని నెలల దాకా రేసులో లేని, అసలెవ్వరూ ఊహించని సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలకు వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.
2025, సంక్రాంతికి ఎంతో సమయం మిగల్లేదు. ఈ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉంది కానీ ఏమేం రిలీజ్ అవుతాయనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒక నెలరోజులు అయితే గానీ ఈ విషయంలో క్లారిటీ రాదని తెలుస్తోంది. ఎందుకంటే సడన్‌గా కొన్ని సినిమాల రేసులోకి దిగవచ్చు. ఈ ఏడాది జూన్-జులై నెలల వరకూ 2025 సంక్రాంతికి కొన్ని సినిమాలు వస్తాయని ప్రకటించారు కానీ ఇప్పుడు అవి కాకుండా వేరే సినిమాలు వస్తున్నాయి.
చిరంజీవి 'విశ్వంభర', రవితేజ 75వ చిత్రం, ప్రభాస్ 'రాజాసాబ్', దిల్‌రాజు 'శతమానం భవతి 2', వెంకటేశ్ - అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి సినిమాలు రావొచ్చని కొంతకాలంగా ప్రచారం సాగింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రతి సంక్రాంతి ఏదో ఒక సినిమా రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకుంటున్నాడు. వచ్చే సంక్రాంతికి కూడా అతని నుంచి ఒక సినిమా రావచ్చని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వీటిలో చాలావరకు సినిమాలు విడుదల తేదీలను మార్చుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
'సంక్రాంతికి వస్తున్నాం' తప్ప మరేదీ 2025 సంక్రాంతి రేసులో లేదు. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' డిసెంబరు నెలలో విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు కానీ ఇటీవల ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దాంతో ఇంతకుముందు సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్న సినిమాలన్నీ కూడా వెనక్కి తగ్గాయి. 'విశ్వంభర' కూడా రిలీజ్ డేట్ మార్చుకుంది. ఇదిలా ఉంటే 'గేమ్ ఛేంజర్'కి పోటీగా బాలకృష్ణ - బాబీ కాంబో సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చింది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కూడా రిలీజ్ డేట్ మార్చుకోవచ్చు. నాగచైతన్య 'తండేల్' సినిమాని సంక్రాంతి సందర్భంగా రిలీస్ చేయాలని చూస్తున్నాడు. కానీ అందరూ రిలీజ్ డేట్స్ గురించి సీక్రెట్ గానే ఉంచుతున్నారు. ఒకవేళ పైన చెప్పినట్లు సంక్రాంతికి సినిమాలు వస్తే ఇంతకుముందు అనుకున్న ముఖచిత్రం మొత్తం మారిపోయినట్లు అవుతుంది.