టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా చాలా కాలం కెరీర్లు కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఇకపోతే వీరిద్దరి కాంబోలో మొదటగా బద్రి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బద్రి సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పూరి జగన్నాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చాలా కాలం ప్రయత్నించాను.
ఒక రోజు ఆయనకు కథ చెప్పే అవకాశం వచ్చింది. ఉదయం నాలుగు గంటలకు కథ చెప్పడం స్టార్ట్ చేశాను. ఉదయం ఎనిమిది గంటలకు కథ చెప్పడం పూర్తి అయింది. కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ కథ సూపర్ గా ఉంది. కానీ క్లైమాక్స్ మాత్రం నచ్చలేదు అన్నాడు. దానితో ఆయన కథ సరిగ్గా వినలేదేమో అని మళ్లీ ఒక సారి క్లైమాక్స్ మొత్తం చెప్పాను. నాకు సరిగానే వినబడింది కానీ క్లైమాక్స్ మార్చు చేద్దాం అన్నాడు. దానితో నేను వెళ్లిపోయాను. కొన్ని క్లైమాక్స్ వర్షన్స్ రాశాను.
కానీ అవి ఏవి నాకు పెద్దగా నచ్చలేదు. ఇక మళ్ళీ పవన్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది ... వెళ్లాను. వెళ్లి ఆ రోజు క్లైమాక్స్ ఏదైతే చెప్పానో దాన్ని మరింత వివరించి చెప్పాను. ఆ రోజు ఇదే చెప్పావు కదా అన్నాడు. ఆ రోజు చెప్పాను కానీ సార్ ఇంతకు మించిన క్లైమాక్స్ ఏది ఆ కథకు సెట్ కాదు అన్నాను. దానితో ఆయన నువ్వు నాకు నచ్చావు. క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. అది మారిస్తే నేను నీకు సినిమా అవకాశం ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు నీకు సినిమా ఛాన్స్ ఇస్తున్నాను అన్నాడు. అలా బద్రి సినిమా సెట్ అయింది అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.