‘తండేల్’ ప్రి రిలీజ్ బిజినెస్... చైతు అప్పుడే సేఫ్ జోన్లో ఉన్నాడా..?
గీతా ఆర్ట్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ ఆశలు ఉంటాయి. నాగచైతన్య - సాయి పల్లవి ఈ కాంబోకి క్రేజ్ ఉంది. పైగా చందు మొండేటి దర్శకుడు. అందుకే తండేల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు బ్యాక్ డ్రాప్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని ప్రచారం జరుగుతుంది .. సినిమా మేకర్స్ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అందుకే తండేల్ పై నమ్మకాలు మరింతగా పెరిగాయి. జనవరిలో సినిమా రిలీజ్ చేస్తారని అందరూ అనుకుంటే ఫిబ్రవరి కి మార్చారు. ఈ విషయంలో అభిమానులు కాస్త నిరాశ చెందారు. కాకపోతే చిత్ర బృందం మాత్రం పోటీలో రావడం కంటే సోలో గా వచ్చే సేఫ్ అయిపోవడం బెటర్ అని భావిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, నాన్ థియేట్రికల్ బేరాలు కూడా క్లోజ్ అయ్యాయని టాక్ .
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రూ. 40 కోట్లకు ఓటీటీ హక్కులు చేజిక్కించుకొందని ప్రచారం నడుస్తోంది. ఆడియో రైట్స్ కింద మరో రూ. 10 కోట్ల వరకూ వచ్చాయట. అంటే ఓవరాల్ గా రూ.50 కోట్లు. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి రేటుకే అమ్ముడవు తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయా హక్కుల రూపంలో కనీసం రూ.20 కోట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. మొత్తంగా నాన్ థియేట్రికల్ నుంచి రూ.70 కోట్లు ఆదాయం వస్తుందని లెక్క కడుతున్నారు. తండేల్ సినిమాకు మొత్తంగా రూ.100 కోట్లు ఖర్చయ్యాయని తెలుస్తోంది. అంటే థియేట్రికల్ గా మరో రూ.30 కోట్లు తెచ్చుకొంటే సినిమా సేఫ్ జోన్లో పడిపోయినట్టే.