టాలీవుడ్లో బిగ్ బెలూన్.. పేలిపోతే అందరూ గల్లంతే...!
తెలుగు సినిమా పరిశ్రమ బుడగలోకి వెళ్ళిపోతుంది. బుడగ పెద్దది గాని కనిపిస్తుంది కానీ.. ఏదో నాటికి పగలటం గ్యారెంటీ. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ దారి తప్పుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు తమ సినిమా రూ.100 కోట్ల సినిమా అని చెప్పుకోవటానికి అగ్ర హీరోలు సిగ్గుపడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే.. తమ సినిమా బడ్జెట్ గురించి నెంబర్ చెప్పుకోవడాన్ని.. చాలామంది హీరోలు ఒక హీరోయిజంగా భావిస్తున్నారు. సినిమా విజయం కన్నా ముందు బడ్జెట్టే మాకు గొప్ప అన్నంత ఫీలింగ్ వీరి లో వచ్చేసింది.
ఒక హీరో సినిమాకు రూ.300 కోట్లు అయ్యాయి అంటే.. మరో హీరో తన సినిమాకు రూ.400 కోట్లు బడ్జెట్ అయినట్టు చెప్పుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక హీరోలు ప్రతిసారి తన గత సినిమాతో పోలిస్తే బడ్జెట్ పెరగాలని.. సినిమా జయాప జయాలతో సంబంధం లేకుండా తన రెమ్యూనరేషన్ పెరగాలని అనుకుంటున్నారు. రవితేజ, గోపీచంద్ లాంటి హీరోలు సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతున్న రెమ్యూనరేషన్ ఏ మాత్రం తగ్గించడం లేదు. వీళ్ళకి తోడు వరుణ్ తేజ్ కూడా జాయిన్ అయిపోయాడు. వరుణ్ తేజ్ వరుస ప్లాపులు వస్తున్నా రేటు రు. 7 కోట్లకు తగ్గడం లేదు.
మార్కెట్ లేక ప్రేక్షకులు సినిమాలు చూడక.. కలెక్షన్లు లేక.. నిర్మాతలు దారుణంగా నష్టపోతున్నా.. హీరోలు మాత్రం రెమ్యూనరేషన్లు పెంచుకుంటూ పోతున్నారు. చాలామంది హీరోలు కెరీర్ పరంగా వైవిధ్యంలేని మూస హీరోలుగా ముద్రలు వేయించుకుంటున్నారు. దర్శకులు కూడా ఇదే ఇమేజ్ జోరులో పడిపోయారు. టాలీవుడ్ హీరోలు ఇకపై బలమైన కథనాలు వదిలేసి రెమ్యూనరేషన్లు బడ్జెట్లో పెంచుకుంటూ పోతుంటే.. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా ఏదో ఒక రోజుకు వీళ సినిమాలు కొనేవాళ్ళు కూడా ఉండరు. మరి దీనిపై మన హీరోలు ఎప్పటికి దృష్టి పెడతారో చూడాలి.