తెలంగాణ ప్రభుత్వానికి సహకరించండి..యువతకు అల్లు అర్జున్ పిలుపు
బాధితులకు అండగా నిలవాలని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు కదలాలన్నారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి డ్రగ్స్ సోల్జర్స్‌గా మారాలని విజ్ఞప్తి చేశారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్: 1908కు ఫోన్ చేయాలని అన్నారు. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్తారని.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారని అల్లు అర్జున్ తెలిపారు. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వారిని శిక్షించడం కాదని. వారికి సాయం చేయడం మాత్రమే అని చెప్పుకొచ్చారు. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దామని ఐకన్ స్టార్ అన్నారు.
తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకో, లేదంటే స్నేహితుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమే కొందరు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. గత కొద్ది రోజుల క్రితం సినిమా వాళ్లు డ్రగ్స్ నియంత్రణ కోసం కృషి చేయాలని సీఏం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఇప్పుడు నటుడు అల్లు అర్జున్ ఇలా యువతకు పిలుపునిచ్చారని సమాచారం. గతంలో చాలా మంది టాలీవుడ్ హీరోలు ఇలాంటి వీడియోలు, మరెన్నో కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే.