సినీ పరిశ్రమ అనేది ఓ కుటుంబంలాంటిదనీ, అందులోని సభ్యులంతా సంతోషంగా ఉండాలనీ, ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉండాలని.. ఇలా రకరకాల మాటలు సినీ ప్రముఖుల నుంచి వినిపిస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని సందర్భాల్లో స్పందిస్తుంటారు కూడా. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చాలా విభిన్నమైంది. ఒక ఘటన జరిగితే.. దానిపై ఎవరూ స్పందించకపోవడం, ఒక్కసారిగా అందరూ మౌనంగా ఉండడం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అది ఏమిటంటే.. హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఆ విషయాన్ని ఎంతో బాధగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆమె ఎంత వేదన అనుభవిస్తోంది అనే విషయం ఆమె పెట్టిన పోస్ట్, ఎమోజీ చూస్తే అర్థమవుతుంది. ఆమె ఈ పోస్ట్ పెట్టిన వెంటనే అభిమానులు, నెటిజన్లు వెంటనే స్పందించి ఆమెకు తమ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెబుతున్నారు. ఇక సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే... సమంత విషయంలో ఎవరూ స్పందించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సమంత ఇంటికి నాగచైతన్య వెళ్లి పరామర్శిస్తాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ, అలా జరగలేదు. కనీసం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో కనిపించలేదు. సమంతతో సినిమాలు చేసిన హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్ వంటి వారు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అంతేకాదు, తోటి హీరోయిన్లు కూడా సమంతకు సానుభూతి తెలుపుతూ మెసేజ్‌లు పెట్టలేదు. తన ఫ్రెండ్స్ అని చెప్పుకునే చిన్మయి, నందినీరెడ్డి వంటి వారు కూడా ఎలాంటి పోస్టులు పెట్టలేదు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
సమంతను ఇండస్ట్రీ నుంచి వెలివేశారా. అందుకే ఆమెను సానుభూతిని తెలియజేయలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్న వారి ఇంట్లో విషాదం నెలకొంటే స్పందించడం, సానుభూతి తెలియజేయడం కనీస ధర్మం కాదా అని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీ నుంచి కేవలం ముగ్గురు హీరోలు మాత్రమే స్పందించారు. సుధీర్‌బాబు, నితిన్, తేజ సజ్జా సమంతకు సానుభూతి తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. ‘నాన్నతో నీకున్న అనుభూతులు, మెమోరీస్ ఎప్పుడూ అలానే పదిలంగా ఉండాలి. నీకు, నీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని తేజ పోస్ట్ చేయగా, ‘మీ నాన్న ఆత్మకు శాంతి చేకూరాలి.. నీకు, నీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని సుధీర్‌బాబు పోస్ట్ చేశారు. ‘జోసెఫ్ ప్రభుగారి మరణ వార్త విని ఎంతో బాధగా అనిపించింది. సమంతకు, ఆమె కుటుంబ సభ్యులకు ఆ దేవుడు శక్తిని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’ అని నితిన్ పోస్ట్ పెట్టారు. కొన్ని సంవత్సరాలపాటు సమంత కెరీర్ ఉజ్వలంగా సాగిన విషయం తెలిసిందే. భర్తతో విడిపోవడం ఆమె జీవితంలో బాధాకరమైన విషయం. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు రావడంతో మరింత మానసిక వేదనకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకొని తిరిగి తన కెరీర్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో తండ్రి మరణం ఆమెకు మరో పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో తన సహచరులు, ఇండస్ట్రీలో ఎంతో కాలంగా తనతో కలిసి పనిచేసిన వారు ధైర్యం చెబితే ఆమెకు ఊరటగా ఉండేది. కానీ, జరగలేదు. ఇండస్ట్రీ అంతా సమంత విషయంలో ఇంత మౌనంగా ఉండడానికి కారణం ఏమిటి అనేది ఎవరికీ అర్థం కావడంలేదు.