తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ హీరో అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తీరు వల్లనే థియేటర్ లో మహిళ మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాబు బ్రెయిన్ డెడ్ అవ్వడంతో కోమాలో ఉండి ప్రాణాలతో కొట్టు మిట్టు ఆడుతున్నాడని చెప్పారు. సినిమా వాళ్లపై తనకు ఎలాంటి కోపం లేదని.. తానే బెనిఫిట్ షోలు వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చానని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలనే తాము కోరుకుంటున్నామని అన్నారు.
సినిమాలు తీస్తే ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ ల రూపంలో ఆదాయం వస్తుందని చెప్పారు. కానీ ఊరేగింపులు, బెనిఫిట్ షోల సమయంలో ప్రాణాలు పోయేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బెనిఫిట్ షోకు సినిమా వాళ్లు రావడానికి పోలీసులు అసలు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. అయినప్పటికీ థియేటర్ యాజమాన్యం హీరోను రానించిందని మండిపడ్డారు. హీరోను చూసేందుకు థియేటర్ లో ఉన్న జనాలు అంతా ఎగబడటంతో అల్లు అర్జున్ బౌన్సర్ లు జనాలు తోశారని అన్నారు. ఈ క్రమంలో తల్లి పిల్లాడిని చేతిలో పట్టుకుని వెళుతుండా కిందపడి ప్రాణాలు కోల్పోయిందని అన్నారు.
ఈ ఘటన జరిగిన తరవాత కూడా సినిమా వాళ్లు థియేటర్ నుండి వెళ్లలేదని మండిపడ్డారు. థియేటర్ వాళ్లు పోలీసులను హీరోను కలవడానికి కూడా అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఏసీపీ వార్నింగ్ ఇచ్చిన తరవాత కూడా అల్లు అర్జున్ సినిమా పూర్తి అయ్యేవరకు వెళ్లనని పోలీసులతో వాదించారని అన్నారు. దీంతో డీసీపీ రంగంలోకి దిగి అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో అల్లు అర్జున్ ను బయటకు తీసుకువచ్చి కారు ఎక్కించారని చెప్పారు. తల్లి చనిపోయింది, పిల్లాడు సీరియస్ గా ఉన్నాడని చెప్పినప్పటికీ బయట కారు రూఫ్ ఎక్కి చేతులు ఊపుకుంటూ వెళ్లాడని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని వివరించారు.