శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందంటే..?
పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని డాక్టర్స్ తెలిపిన విషయం తెలిసిందే. అతను కొలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు అన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీ తేజ్ ప్రస్తుతం స్పృహలో లేడని అన్నారు. శ్రీ తేజ్ ఆరోగ్యం మెరుగుపడడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే త్వరలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
అయితే తాజాగా శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని తెలిపారు. వెంటిలేటర్ సాయం లేకుండా ఆక్సిజన్ తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఫీడింగ్ సక్రమంగా తీసుకుంటున్నాడని.. న్యూరాలజీ కండీషన్ స్థిరంగా ఉందని డాక్టర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. ఇక సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఉందని.. అందుకే అతను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.