సినిమా రాజకీయాన్ని శాసిస్తోందా? రాజకీయం సినిమాని శాసిస్తోందా?
నవరస నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయినప్పటి నాటినుండి ఇంకా ఆ సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఓ స్థాయికి తీసుకెళ్లారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో హీరో కృష్ణ, కృష్ణం రాజు కూడా ఎవరికి నచ్చిన పార్టీలో వారు జాయిన్ కావడం జరిగింది. ఆ సమయంలో రాజకీయంగా హీరో ఎన్టీఆర్, కృష్ణ విభేదించినప్పటికీ... సినిమాల పరంగా మాత్రం వారిమధ్య చాలా ఆరోగ్యకరమైన వాతావరణం కనబడేది. కానీ రానురాను పరిస్థితులు క్షీణిస్తూ వస్తున్నాయి.
మరీ ముఖ్యంగా తాజా రాజకీయాలు, సినిమారంగం అనేది ఎవరికి వారే, యమునా తీరే అన్నట్టు కనబడుతోంది. ఒకప్పుడు రాజకీయం వ్యక్తిగతంగా ఉండేది కాదు. వ్యక్తిగత దూషణలు ఉండేవి కాదు. కానీ నేటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు గురించి అందరికీ తెలిసిందే. పగ, ప్రతీకార రాజకీయాలు అనేవి నేడు ఎక్కువైపోయాయి. వ్యక్తిగత దూషణలతో మొదలై... భార్య, చెల్లి, బిడ్డలను కూడా వదలడం లేదు! ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతూ దిగజారిపోయే పరిస్థితి.
ఈ ఎఫెక్ట్ నేడు సినిమాలపై కూడా పడుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. నచ్చిన వర్గం సినిమాలలో ఉన్నపుడు వారికి బాగానే ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. నచ్చలేదంటే సరేసరి... కోట్ల పెట్టుబడి పెట్టిన సినిమాలు కూడా కుదేలు అయ్యే పరిస్థితి. గడిచిన ఐదేళ్లు పాలనలో ఆంధ్రా రాష్ట్రంలో ఈ విషయం మనకు స్పష్టంగా అర్ధమైంది. అయితే నేడు పరిస్థితి కాస్త మెరుగైనప్పటికీ, సినిమావాళ్లు అంటే ఎక్కడో తెలియని తక్కువ అన్న భావన రాజకీయ నాయకులలో ఎక్కువైందనే అనుమానాన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.