నేను కాజల్ ను అనలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్?

frame నేను కాజల్ ను అనలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్?

praveen
నిధి అగర్వాల్... ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత అశోక్ గల్లా హీరోగా వచ్చిన "హీరో" మూవీలో మెరిసింది. ఆ సినిమా ఫంక్షన్లో నిధి కోసం ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. అయితే, ఆ సమయంలో కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. డబ్బులు తీసుకుని మరీ నిధి అభిమానులుగా కొందరు హడావుడి చేశారని టాక్ నడిచింది. అదంతా పక్కన పెడితే, "హీరో" తర్వాత నిధి మళ్లీ టాలీవుడ్ తెరపై కనిపించలేదు.
కానీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం "హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్"లో నిధి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో ఆమె పంచమి అనే యువరాణిగా కనిపించనుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. ఎట్టకేలకు 2025 మార్చి 28న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా హిట్ అయితే నిధి రేంజ్ అమాంతం పెరిగిపోతుందని అనడంలో సందేహం లేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ మూవీ "రాజా సాబ్"లో కూడా నిధి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండగా, వారిలో నిధి ఒకరు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం నిధి అగర్వాల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవడం ఖాయం. ఈ సంవత్సరం నిధి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాల విడుదల దగ్గర పడుతుండటంతో నిధి ప్రమోషన్ల బాట పట్టింది. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఓ కామెంట్ పై క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ చాలా సినిమాలు చేసినా, ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్నా తెలుగు నేర్చుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. "అందరికీ నమస్కారం" అని రెండు ముక్కలు మాట్లాడి ఆ తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడేస్తుంటారు.
అయితే, ఆ లిస్ట్ లో తాను చేరకూడదని నిధి తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టింది. గతంలో తాను కూడా స్టేజ్ మీద "అందరికీ నమస్కారం" అనేదాన్నని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నా, స్టేజ్ మీద మాత్రం "అందరికీ నమస్కారం"తోనే తన స్పీచ్ ముగిస్తుందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో నిధి చేసిన కామెంట్స్ కాజల్ ను ఉద్దేశించే అని చాలా మంది అనుకున్నారు. కానీ నిధి మాత్రం తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, తన గురించే చెప్పుకున్నానని స్పష్టం చేసింది. దాంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: