రాజన్న సిరిసిల్లలో బలగం సీన్ రిపీట్ అయ్యింది. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో పదేళ్ల క్రితం విడిపోయిన అమ్మదమ్ములు తిరిగి కలుసుకున్నారు. గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు చిన్న చిన్న విబేధాల కారణంగా 10 ఏళ్ల క్రితం విడిపోయారు. ఇద్దరూ ఒకే గ్రామంలో ఉంటున్నా దశాబ్దకాలంగా వీరిద్దరి మధ్య మాటలు లేవు. ఒకరి ఇంట్లో కార్యక్రమాలకు మరొకరు దూరంగా ఉంటున్నారు. తన తండ్రిని అతడి సోదరుడిని కలిపేందుకు నాగయ్య కుమారుడు చాలా సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు. కాగా నాలుగు రోజుల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి మృతి చెందాడు.
దీంతో తిరుపతి మూడు రోజుల కార్యక్రమంలో ఇద్దరు అన్నదమ్ములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే నాగయ్య కుమారుడు శ్రీనివాస్ అన్నదమ్ములు ఇద్దరినీ మరోసారి కలిపే ప్రయత్నం చేశాడు. వారి పాత రోజులను గుర్తు చేశారు. దీంతో అన్నదమ్ములు ఇద్దరూ ఎమోషనల్ అయ్యి మళ్లీ కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటి నుండి అయినా కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సీన్ అక్కడ ఉన్నవారిని సైతం కన్నీళ్లు పెట్టేలా చేసింది.
ఇదిలా ఉంటే గతేడాది వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటించిన బలగం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలంగాణలో ఈ సినిమాకు ఎంతో క్రేజ్ వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అవ్వడంతో థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలకే విడిపోతే ఎంత బాధపడతారో ఈ సినిమా తెలిసి వచ్చేలా చేసింది. ముఖ్యంగా తోబుట్టువుల బంధం ఎంత బలంగా ఉంటుందో, వారి మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో ఈ సినిమా కండ్లకు కట్టినట్టు చూపించింది.