బాక్సాఫీస్ రివ్యూ: “హైప్ ఎక్కువ.. స్టఫ్ జీరో – ఆగస్టు సినిమాల పరిస్థితి ఘోరం!”

Amruth kumar
2025లో మ‌రో నెల జారిపోయింది. ఆగ‌స్ట్ కూడా తెలుగు చిత్ర‌సీమ‌కు ఎలాంటి ఊర‌ట ఇవ్వ‌లేక‌పోయింది. జూలైలోనూ వరుస పరాజయాలతో ఇండస్ట్రీని కలవరపరిచిన టాలీవుడ్, ఆగస్టులోనూ అదే దారి పట్టింది. నిర్మాతలు, బయ్యర్లు బాక్సాఫీస్ వైపు ఆశగా ఎదురుచూశారు కానీ చివ‌రికి నిరాశే మిగిలింది. ఆగస్టు మొదటి వారమే బలహీనంగా స్టార్ట్ అయింది. థ్యాంక్యూ డియర్, బాలు గాడి లవ్ స్టోరీ, బకాసుర రెస్టారెంట్ సినిమాలు రిలీజైనా ప్రేక్షకులకు అవి వచ్చిన సంగతే తెలియకుండా పోయింది. ప్రమోషన్లు లేకపోవడం, కంటెంట్ బలహీనంగా ఉండడం వల్లే ఈ సినిమాలు సైలెంట్‌గా బాక్సాఫీస్‌ నుంచి మాయమయ్యాయి.



ఆగస్టు 14న మాత్రం హై వోల్టేజ్ అంచనాలతో రెండు భారీ సినిమాలు ఢీ కొట్టాయి – వార్ 2, కూలీ. ఈ రెండూ రిలీజ్ అవుతాయనే అనౌన్స్‌మెంట్‌తోనే టాలీవుడ్ వాతావరణం వేడెక్కింది. ఫ్యాన్స్ కూడా ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లారు. మొదటి రోజు ఉదయం షోలు, ఓపెనింగ్స్ వసూళ్లు అదరగొట్టాయి. కానీ అక్కడితోనే గేమ్ ఫినిష్ అయింది. సినిమాల్లో స్టఫ్ లేకపోవడం, కథలు బలహీనంగా ఉండటంతో రెండూ రెండు రోజుల్లోనే డౌన్ అయ్యాయి. వార్ 2 బయ్యర్లకు పెద్ద నష్టం మిగిల్చింది. కూలీ కూడా నష్టాల దారి పట్టింది కానీ డామేజీ మాత్రం వార్ 2కి ఎక్కువైంది. ఇక మధ్యలో వచ్చిన అనుపమ పరమేశ్వరన్‌ పరదా కూడా బాక్సాఫీస్‌ని మెప్పించలేకపోయింది. థీమ్ బాగానే ఉన్నా, చెప్పే తీరు లోపించడంతో ఆ సినిమా కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

 

మేఘాలు చెప్పిన ప్రేమకథ, కన్యాకుమారి మూవీలు విడుదలకు ముందు కాస్త హడావుడి చేసినా, కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకుల మదిలో నిలవలేకపోయాయి. చివరి వారంలో రిలీజైన బార్బరిక్, అర్జున్ చక్రవర్తి, సుందరకాండ కొంత హడావుడి చేసినా… పరిస్థితి అలాగే కొనసాగింది. సుందరకాండకు మంచి రివ్యూలు వచ్చాయి, కాని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం కనిపించలేదు. మిగతా సినిమాల పరిస్థితి కూడా బెటర్ కాదు. మొత్తం మీద 2025 ఆగస్ట్‌లో ఒక్క హిట్ కూడా లేకుండా టాలీవుడ్ ఖాతా ఖాళీగా మిగిలింది. వరుస పరాజయాలు నిర్మాతలు, బయ్యర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఈ దెబ్బ నుంచి తేరుకోవాలంటే సెప్టెంబర్‌లో ఏదో ఒక అద్భుతమైన విజయం రావాల్సిందే అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. నిజంగానే 2025 ఆగస్ట్ – టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత నిరాశజనకమైన నెలగా రికార్డు కట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: