"అది కేవలం జూ.ఎన్టీఆర్ కోసం మాత్రమే".. మరొకసారి గట్టిగా నొక్కి చెప్పిన రిషిబ్ శెట్టి..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్ సెలబ్రిటీలకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఏ చిన్న విషయం జరిగినా, కొన్ని సెకన్లలోనే ట్రోలింగ్ మొదలవుతుంది. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలు విడుదలవుతున్న సందర్భాల్లో ఈ ట్రోలింగ్ మరింతగా పెరుగుతోంది. ఇలాంటి సినిమాల్లో నటించిన స్టార్ హీరోలు  అన్ని భాషల్లో తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తారు. అయితే, ప్రతి భాషలోనూ మాట్లాడడం చాలా కష్టమైన పని. కొంతమంది స్టార్స్‌కు రెండు లేదా మూడు భాషలు మాత్రమే బాగా వచ్చి ఉంటాయి. అలాంటి సందర్భాల్లో, వాళ్లు తమ మాతృభాషలోనే మాట్లాడటం సహజం. ఇటీవల రిషిబ్ శెట్టి కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. తన తాజా చిత్రం "కాంతార: చాప్టర్ 1" ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పూర్తిగా కన్నడలో మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలుగు ప్రేక్షకుల కోసం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఆయన కన్నడలో మాట్లాడడమేంటి? తెలుగు ప్రేక్షకులను గౌరవించడం లేదా? అంటూ కొందరు ట్రోల్స్ రగడ మొదలుపెట్టారు.

ఈ విమర్శలపై రిషిబ్ శెట్టి వెంటనే స్పందిస్తూ తన మనసులోని మాట బయటపెట్టారు.  “నాకు తెలుగు అంతగా రాదు. కానీ తెలుగు ప్రేక్షకుల ప్రేమ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఈసారి ‘జై హనుమాన్’ సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నప్పుడు కచ్చితంగా తెలుగులో మాట్లాడతాను” అని అప్పట్లోనే హామీ ఇచ్చారు. అయితే, తాజాగా ఓ నేషనల్ మీడియా ఆయన హైదరాబాద్‌లో చెప్పిన కన్నడ స్పీచ్‌కి మరోసారి ప్రాధాన్యం ఇస్తూ మళ్ళి ప్రశ్నించింది. దీంతో  ఈ విషయం మళ్లీ వైరల్ అయింది. దాంతో రిషబ్ శెట్టి మరొకసారి ఓ క్లారిటీ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ .. “ఆ స్పీచ్‌ నేను జూనియర్ ఎన్టీఆర్ కోసం మాత్రమే ఇచ్చాను. నేను ఒక కన్నడ వ్యక్తిని. నాకు నా భాషపై అమితమైన ప్రేమ ఉంది. ఒక మనిషి తన భాషను ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ కారణంగా పక్క భాషను కించపరచడం నేను ఎప్పుడూ చేయను. జూనియర్ ఎన్టీఆర్ నా బ్రదర్‌లా ఉంటాడు. ఆయన పట్ల నాకు ఉన్న గౌరవం, అభిమానాన్ని నిజాయితీగా వ్యక్తపరచాలనిపించింది. నా మాతృభాషలోనే ఆ ఫీలింగ్‌ని పూర్తిగా వ్యక్తం చేయగలనని అనిపించింది. అందుకే కన్నడలో మాట్లాడాను. నాకు తెలుగు పూర్తిగా రాదు, హిందీ–ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే. కాబట్టి నా భావాలను స్పష్టంగా చెప్పడానికి నా భాషే సరైన మార్గం అనిపించింది. అందుకే అలా చేశాను. ఇది తప్పు అని నేను అనుకోను” అంటూ స్పష్టంగా చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “జై హనుమాన్ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ సినిమాతో నాకు తెలుగు ప్రేక్షకులతో మరింత దగ్గర కావాలని ఉంది. ఇకపై తెలుగు అభిమానులతో మాట్లాడేటప్పుడు నేను కచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాను. ఆ ప్రయత్నం ఇప్పటినుంచే మొదలుపెడుతున్నాను” అని ధీమాగా చెప్పారు. రిషబ్ శెట్టి  “జై హనుమాన్” సినిమా లో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. “కాంతార” సిరీస్ తరహాలోనే ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. రిషబ్ శెట్టి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అభిమానులు “ఇది నిజమైన ఆర్టిస్ట్ మనసు” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలా మరోసారి రిషిబ్ శెట్టి తన నిజాయితీతో, సూటిగా మాట్లాడే స్వభావంతో అభిమానుల మనసు గెలుచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: