అఖండ 2 నే కాదు... టాలీవుడ్‌కు అసలు ఎప్పటకీ బుద్ధి రాదా...?
కొన్ని రోజులుగా అఖండ 2 విడుదల వాయిదా టాలీవుడ్ అంతటా పెద్ద చర్చగా మారింది. అయితే కాసేపు ఈ సినిమా విషయంలో భావోద్వేగాలను పక్కనపెట్టి చూస్తే “ ఇలాంటి పరిస్థితి టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి జరుగుతుందా ? ” అని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. నిజానికి ఇది కొత్త కాదు, దశాబ్దాలుగా పునరావృతమవుతున్న సమస్య. గోపీచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ ఉదాహరణ ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ మరిచిపోలేరు. ఉదయం షోకే సిద్ధమవగా గంట ముందు వాయిదా పడింది. బి గోపాల్, నయనతార, మణిశర్మ లాంటి బలమైన టీమ్ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు విడుదలను అవాంతరం చేశాయి.
అక్కినేని ఫ్యాన్స్ అయితే నాగార్జున ఢమరుకం కథను ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. చివరి నిమిషంలో నిలిచిపోయిన రిలీజ్, ఎన్నోసార్లు రిలీజ్ డేట్లు మారడం, తరువాత మాత్రమే థియేటర్లలోకి రావడం చరిత్ర అయింది. ఇదే పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు, కమల్ హాసన్ విశ్వరూపం, చిరంజీవి అంజి, బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు, అనుష్క అరుంధతి, రవితేజ క్రాక్ వంటి ఎన్నో సినిమాలకు ఎదురయ్యింది. లిస్ట్ చెబుతూ పోతే అంతం ఉండదు. ఇవి అన్నీ చివరకు విడుదలైన సినిమాలే, కానీ విడుదలకు ముందు తలెత్తిన సమస్యలు మాత్రం పరిశ్రమలో మచ్చగా నిలిచిపోయాయి.
ఇలాంటి విషయాలలో చరిత్ర చూస్తే ఒకే కామన్ పాయింట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్. తీసుకున్న అప్పులు, మిగిలిపోయిన బాకీలు, టెక్నీషియన్ల చెల్లింపులు, ఫైనాన్సియర్ల ఒప్పందాలు సమయానికి క్లియర్ కాకపోవడం వల్లే చాలా సినిమాలు రిలీజ్‌కు గంటలు లేదా రోజులు ముందు ఆగిపోయాయి. ఇది ఒక్కొక్కరికి జరిగే భిన్న ఉదంతం కాదు.. టాలీవుడ్‌లో వందల్లో నిర్మాతలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువ. బడ్జెట్ పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరిగింది. వచ్చే ఏడాది విడుదల కావాల్సిన ఒక భారీ పాన్ ఇండియా సినిమాకు సుమారు రు. 200 కోట్ల ఆర్థిక సెటిల్‌మెంట్ ఇంకా పెండింగ్లో ఉందనే వార్తలు టాలీవుడ్‌లో గుసగుసలుగా వినిపిస్తున్నాయి. అది నిర్దిష్ట సమయానికి క్లియర్ కాకపోతే ఆ సినిమాకూ అఖండ 2 లాంటి పరిస్థితి తప్పదని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నష్టం ఒక్క ఫ్యాన్స్ ఎమోషన్స్‌కే కాదు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ మేనేజ్‌మెంట్, రోజువారీ జీతాలతో పని చేసే సిబ్బందికీ తీవ్ర ప్రభావమే. ఒక రిలీజ్ నిలిచిపోవడం వందల కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. చరిత్ర ఎన్నిసార్లు హెచ్చరికలు ఇచ్చినా ప్రొడ్యూసర్లు బడ్జెట్ కంట్రోల్ మరియు ఆర్థిక ప్రణాళిక పట్ల జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా అఖండ 2 లాంటి సంఘటనలు తిరిగి తిరిగి ఎదురవుతున్నాయనేది సలువుగానే తెలుస్తోంది.