అఖండ 2 ఫినిష్ .. వాట్ నెక్ట్స్ బోయపాటి... !
టాలీవుడ్ లో భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను గతంలో 'వినయ విధేయ రామ' మరియు 'స్కంధస సినిమాలతో తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. అయితే, తనకు అచ్చొచ్చిన హీరో, నందమూరి నట సింహం బాలకృష్ణతో కలిసి పనిచేసిన బోయపాటి అఖండ 2తో మళ్లీ విజయాన్ని అందుకున్నారు. వీరిద్దరి శక్తివంతమైన కాంబోలో వచ్చిన ‘అఖండ 2’ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ విజయంతో బోయపాటి ఊపిరి పీల్చుకోవడమే కాక, టాలీవుడ్లో తన స్థానాన్ని తిరిగి పదిలం చేసుకున్నారు. 'అఖండ 2' హవా ఈ వారం కూడా కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
బోయపాటి తదుపరి సినిమా ఎవరితో ..?
'అఖండ 2' తర్వాత బాలకృష్ణ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఏ హీరోతో చేయబోతున్నారనే విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి టాలీవుడ్ టాప్ హీరోలందరూ వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వారిలో ఎవరైనా అందుబాటులోకి రావాలంటే కనీసం ఒక సంవత్సరం సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో, కాస్తో కూస్తో అందుబాటులో ఉండే అవకాశం ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమే.
అల్లు అర్జున్ – బోయపాటి కాంబోపై ఇంట్రెస్టింగ్ టాక్
ప్రస్తుతం అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తయితే, ఆ తర్వాత బన్నీ - బోయపాటి శ్రీనుతో కలిసి పనిచేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి బలమైన టాక్ వినిపిస్తోంది. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్లో గతంలో వచ్చిన సరైనోడు అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. అది అప్పటికి బన్నీ కెరీర్లోనే పెద్ద విజయంగా నిలిచింది. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మళ్లీ సెట్ అయితే, సినిమాపై కచ్చితంగా ప్రేక్షకుల్లో భారీ ఫోకస్ ఏర్పడుతుంది.
ఈ కాంబో సెట్ అవ్వడానికి మరో బలమైన కారణం ఉంది. బోయపాటి శ్రీను, అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నారు. దీంతో, బన్నీతో ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం చాలా సులభం అనేది ఇన్ సైడ్ వర్గాల మాట. బోయపాటి సైతం బన్నీతో మళ్లీ పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారని, దానికోసం ఒక పవర్ఫుల్ కథను కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత బోయపాటి శ్రీను తదుపరి సినిమాపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.