"రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్న దయచేసి ఆ పని చేయకండి"..శ్రీలీల స్పెషల్ రిక్వెస్ట్..!
ఇటీవల ఈ ఏఐ దుర్వినియోగం వలలో చిక్కుకున్న వారిలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు అకస్మాత్తుగా వైరల్‌గా మారాయి. మొదట వాటిని చూసిన చాలామంది అవి నిజమైనవేనని నమ్మారు. అయితే, కొద్ది సమయంలోనే అవి పూర్తిగా ఏఐ ద్వారా తయారుచేసిన ఫేక్ చిత్రాలని తెలిసి షాక్‌కు గురయ్యారు. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై స్పందించిన శ్రీలీల తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేసింది. రెండు చేతులు జోడించి, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరిని ఆమె హృదయపూర్వకంగా కోరుతూ, “దయచేసి ఏఐ ద్వారా రూపొందించిన అసభ్యకరమైన, అర్థంలేని కంటెంట్‌ను సర్క్యులేట్ చేయొద్దు” అని విజ్ఞప్తి చేసింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి అమ్మాయి ఒక రక్షణతో కూడిన వాతావరణం ఉంటుందనే నమ్మకంతోనే అడుగుపెడుతుందని ఆమె పేర్కొంది.
తన బిజీ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా తన గురించి జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారం ఆలస్యంగా తన దృష్టికి వచ్చిందని శ్రీలీల వెల్లడించింది. తాను ఎప్పుడూ ప్రతి చిన్న విషయంపైనా చాలా జాగ్రత్తగా ఉంటానని, కానీ ఈసారి జరిగిన విషయం మాత్రం పూర్తిగా జీర్ణించుకోలేనిదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు మానసికంగా ఎంతటి వేదన కలిగిస్తాయో మాటల్లో చెప్పలేమని ఆమె చెప్పింది.ఇకపై ఇలాంటి ఏఐ ఫేక్ కంటెంట్‌ను ఎవరూ ఎంకరేజ్ చేయవద్దని, మహిళలను అవమానించే విధంగా తయారయ్యే పోస్టులు, ఫోటోలను షేర్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరింది. తనకు అండగా నిలవాలని, ఇలాంటి అన్యాయాలపై అందరూ గట్టిగా నిలబడాలని శ్రీలీల విజ్ఞప్తి చేసింది.
ఈ నేపథ్యంలో శ్రీలీల విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారింది. అనేక మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, ఏఐ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన మరోసారి ఏఐ టెక్నాలజీని ఎంత బాధ్యతగా ఉపయోగించాలో గుర్తుచేస్తోంది.