హెరాల్డ్ ఫ్లాష్‌బ్యాక్ 2025: సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా..ఆ విషయంలో మాత్రం చరిత్ర సృష్టించిన “మాస్ జాతర”!

Thota Jaya Madhuri
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు మాస్ మహారాజా రవితేజ. ఎనర్జీ, స్పీడ్, డైలాగ్ డెలివరీతో పాటు మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కథలను ఎంచుకుంటూ, ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో తన స్థానం నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి రవితేజ 2025లో అభిమానుల ముందుకు తీసుకొచ్చిన సినిమా “మాస్ జాతర”. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే, టైటిల్ నుంచి పోస్టర్స్ వరకు అన్నీ మాస్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్నట్లుగానే కనిపించాయి. ట్రైలర్, టీజర్ రిలీజ్ అయిన తర్వాత అయితే అంచనాలు మరింత పెరిగిపోయాయి. “ఇది రవితేజ మార్క్ మాస్ సినిమా”, “వింటేజ్ రవితేజ తిరిగి వచ్చాడు” అంటూ సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగాయి. సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన ప్రమోషన్లలో కూడా యూనిట్ అంతా ఇదే నమ్మకంతో కనిపించింది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనే ధీమా స్పష్టంగా కనిపించింది.


కానీ, అక్టోబర్ 31న సినిమా థియేటర్లలో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా హిట్ అవుతుందన్న అంచనాలు కాస్తా… పూర్తి నిరాశగా మారాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అట్టర్ ఫ్లాప్‌గా మారిపోయింది.కేవలం సాధారణ ప్రేక్షకులే కాదు, రవితేజకు వీరాభిమానులుగా ఉన్న ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.“సినిమాలో అసలు కథే లేదు”,“రవితేజ ఎనర్జీ తప్ప మిగతా ఏదీ పని చేయలేదు”,“మాస్ పేరు పెట్టుకుని కంటెంట్ మర్చిపోయారు” అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి.ఇక కొందరు అభిమానులు అయితే, రవితేజ తన కథల ఎంపిక విషయంలో పూర్తిగా మార్పు తీసుకురావాలి అని కూడా స్పష్టంగా చెప్పేశారు. ఈ ఏడాది విడుదలైన చెత్త ఫ్లాప్ సినిమాల జాబితాలో “మాస్ జాతర” ఒకటిగా నిలిచింది. చెప్పాలంటే, 2025లో వచ్చిన వన్ ఆఫ్ ది టాప్ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.


ఇంత పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ, “మాస్ జాతర” ఒక విషయంలో మాత్రం టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అదే… ప్రీమియర్ షోస్ విషయంలో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం.సాధారణంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలను అధికారిక విడుదల తేదీకి ఒక రోజు ముందు లేదా అదే రోజు అర్థరాత్రి వేళల్లో ప్రారంభించడం ఆనవాయితీగా ఉంది.

ఉదాహరణకు: ఓఘ్ సినిమా అక్టోబర్ 25న విడుదల అయితే, అక్టోబర్ 24 రాత్రి 10 గంటల నుంచే ప్రీమియర్స్ వేశారు.

పుష్ప 2 డిసెంబర్ 6న విడుదలైతే, డిసెంబర్ 5న ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు.

కానీ, “మాస్ జాతర” విషయంలో మాత్రం నిర్మాతలు పూర్తిగా భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.

ప్రీమియర్ డేట్‌నే అధికారిక రిలీజ్ డేట్‌గా ప్రకటించిన తొలి సినిమా. “మాస్ జాతర”ను అక్టోబర్ 31 సాయంత్రం 6 గంటల నుంచే ప్రీమియర్ షోల ద్వారా విడుదల చేశారు. అంతేకాదు, అదే రోజును అధికారిక విడుదల తేదీగా ప్రకటించడం విశేషం. అంటే, ప్రీమియర్ షోలు మరియు రెగ్యులర్ షోలు అన్న తేడా లేకుండా, నేరుగా సాయంత్రం నుంచే సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇలా ప్రీమియర్ రిలీజ్ డేట్‌ను అధికారిక రిలీజ్ డేట్‌గా ప్రకటించిన తొలి తెలుగు చిత్రంగా “మాస్ జాతర” నిలిచింది. ఇది టాలీవుడ్‌లో అరుదైన ప్రయోగంగా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.



వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?

ఈ నిర్ణయం వెనుక థియేటర్ల లభ్యత, షో టైమింగ్స్, కలెక్షన్లపై ప్రభావం వంటి అంశాలు ఉన్నాయని అప్పట్లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, అప్పట్లో థియేటర్లపై ఉన్న “బాహుబలి: ది ఎపిక్” ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, అలాగే వీలైనంత త్వరగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ నడిచింది. సినిమా కంటెంట్ పరంగా ఎంత పెద్ద డిజాస్టర్ అయినా, మార్కెటింగ్ మరియు రిలీజ్ స్ట్రాటజీ విషయంలో మాత్రం “మాస్ జాతర” కొత్త దారిని చూపించింది అనే చెప్పాలి.



ఫ్లాప్ అయినా… ఫ్లాష్‌బ్యాక్‌లో నిలిచిపోయిన సినిమా :

మొత్తానికి, “మాస్ జాతర” రవితేజ కెరీర్‌లో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. బాక్సాఫీస్ వద్ద పూర్తిగా బోల్తా కొట్టినా, ప్రీమియర్ షోల విషయంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. అందుకే, 2025 ఫ్లాష్‌బ్యాక్‌లో “మాస్ జాతర”ను గుర్తు చేసుకుంటే.. సినిమా అట్టర్ ఫ్లాప్… కానీ ఒక విషయంలో మాత్రం చరిత్ర సృష్టించిన ‘మాస్ జాతర’ అని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: