రాజా సాబ్‌కు ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా... సినిమా చుట్టూ ఏం జరుగుతోంది..?
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ పేరు వింటేనే రికార్డులు వణుకుతాయి. 'సలార్', 'కల్కి 2898 AD' చిత్రాలతో ప్రభాస్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. అయితే, ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’ పై ఉంది. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నప్పటికీ, ఎక్కడో చిన్న అసంతృప్తి కనిపిస్తోంది. సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే ప్రమోషన్లతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ‘రాజా సాబ్’ విషయంలో ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్లు, రెండు పాటలు అభిమానులను మెప్పించినా ఒక సాధారణ ప్రేక్షకుడిలో ‘కచ్చితంగా చూడాలి’ అనే స్థాయి హైప్‌ను మాత్రం క్రియేట్ చేయలేకపోయాయి. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావాలంటే, కేవలం ప్రభాస్ ఇమేజ్ సరిపోదు; కంటెంట్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలి.
సంక్రాంతి రేసు.. కఠినమైన పోటీ
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ దాదాపు సోలో రిలీజ్‌లే. కానీ ఈసారి సీన్ మారింది. సంక్రాంతి బరిలో 'రాజా సాబ్' కు గట్టి పోటీ ఎదురవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో అనిల్ స్టైలే వేరు. ఇక మాస్ మహారాజా రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలు కూడా తమ సినిమాలతో పండగ రేసులో ఉన్నారు. ప్రేక్షకులు ఇప్పుడు కేవలం స్టార్ ఇమేజ్ చూసి థియేటర్లకు రావడం లేదు. ముఖ్యంగా టికెట్ రేట్లు పెరిగిన నేపథ్యంలో, రివ్యూలు బాగుంటేనే థియేటర్ వైపు అడుగు వేస్తున్నారు.
థమన్, మారుతిపైనే భారం :
ఇంతటి పోటీని తట్టుకుని ‘రాజా సాబ్’ నిలబడాలంటే, ఇకపై వచ్చే కంటెంట్ మామూలుగా ఉంటే సరిపోదు. అది 'ఎక్స్‌ట్రార్డినరీ'గా ఉండాలి. ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్ నుంచి ఒక భారీ ‘బ్యాంగర్’ సాంగ్ లేదా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడిన ట్రైలర్ రావాల్సి ఉంది. మారుతి తన కామెడీ టైమింగ్‌తో పాటు, ప్రభాస్‌లోని మాస్ యాంగిల్‌ను ఏ విధంగా చూపిస్తారనే దానిపైనే సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రీ - రిలీజ్ ఈవెంట్‌కు ముందే రాజా సాబ్ టీమ్ నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ వస్తే తప్ప, ఈ సంక్రాంతి పోటీలో ప్రభాస్ భుజాల మీద ఉన్న బరువు తగ్గదు. మరి మారుతి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో ? వేచి చూడాలి.