ఎన్టీఆర్ వీరఅభిమాని రాజు పాడె మోసిన నందమూరి కుటుంబం..!

Thota Jaya Madhuri
దివంగత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి వీరాభిమాని, అఖిల భారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రరాజు అలియాస్ ఎన్టీఆర్ రాజు (శ్రీరామచంద్రరాజు) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలియగానే ఎన్టీఆర్ అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. ముందుగా స్థానిక ఆర్బీ సెంటర్ వద్ద ఉంచిన ఆయన మృతదేహానికి అభిమానులు, శ్రేయోభిలాషులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

 

అనంతరం తిరుమల క్షేత్రంలోని కానుకమాను వద్ద ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు.ఈ అంత్యక్రియల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, ఆయన కుమార్తె మోహనరూప, సినీనటుడు చైతన్యకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే, రాజు కుమారుడు శ్రీధర్వవర్మ, ఇతర బంధువులను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా మోహనరూప మాట్లాడుతూ, “రామచంద్రరాజు గారు కేవలం ఎన్టీఆర్ గారి వీరాభిమాని మాత్రమే కాదు. మా కుటుంబ సభ్యుడిగా, సన్నిహితుడిగా ఎంతో కాలం మాతో కలిసిమెలిసి ఉన్న వ్యక్తి. ఆయన అకాల మరణం మాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం” అని అన్నారు.



అంత్యక్రియల సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తమ నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, షాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి ఉపమేయర్ ఆర్‌సీ మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ యాదవ్, తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మాజీ జేఈవో శ్రీనివాసరాజు తదితరులు హాజరై రామచంద్రరాజు గారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలు, అభిమాన సంఘాల బలోపేతానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా రామచంద్రరాజు అందరి మన్ననలు పొందారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ, ఎన్టీఆర్ అభిమాన లోకానికి ఆయన మరణం తీరని లోటని వారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: