"ట్యాగ్స్ తో పబ్లిసిటీ తెచ్చుకునే రకం కాదు నేను"..అడవి శేష్ కామెంట్స్ ఆ ముగ్గురు తలపొగరు హీరోలకేనా..?

Thota Jaya Madhuri
అడవి శేష్..తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న ఈ హీరో, గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా విజయం తర్వాత అడివి శేష్ వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.అడివి శేష్ చేసిన దాదాపు ప్రతి సినిమా మంచి టాక్‌ను సంపాదించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. కథే ప్రధానంగా సినిమాలు చేయాలనే ఆయన ఆలోచన, ఆయనను ఇతర హీరోల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతోంది. అందుకే స్టార్‌డమ్ కన్నా కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే హీరోగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.ఇటీవల ఆయన నటించిన తాజా సినిమా టీజర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన అడివి శేష్, హీరోలు పెట్టుకునే ట్యాగ్‌లు  గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మధ్యకాలంలో ఒక సినిమా హిట్ అయితే చాలు, సెలబ్రిటీలు తమ పేర్లకు పక్కన కొత్త ట్యాగ్‌లను జోడించుకుంటున్న సంగతి తెలిసిందే. వరుస హిట్స్ వస్తే మరో బ్రాండ్‌లా మారి, ప్రత్యేక లోగోలు, పీఆర్ టీమ్‌లతో వాటిని వైరల్ చేయడం కూడా ట్రెండ్‌గా మారిపోయింది.

 

ఈ నేపథ్యంలో యాంకర్ అడివి శేష్‌ను ఉద్దేశించి,“మీరు వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ, ఎందుకు ఇప్పటివరకు ఎలాంటి ట్యాగ్ పెట్టుకోలేదు?” అని ప్రశ్నించారు.దానికి అడివి శేష్ చాలా స్పష్టంగా, సూటిగా సమాధానం ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ,“నాకు అందరిలాగా ట్యాగ్‌లు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ట్యాగ్ పెట్టుకుని, దానికి పీఆర్ టీమ్‌ని పెట్టి, ఒక లోగో డిజైన్ చేసి, దాన్ని బలవంతంగా వైరల్ చేయడం నాకు నచ్చదు. నాకు చిన్నప్పుడే మా అమ్మా నాన్న నాకు ‘అడివి శేష్’ అనే ట్యాగ్ ఇచ్చారు. అదే నా కెరీర్ మొత్తానికి సరిపోతుంది. ఇంకొక ట్యాగ్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు. నాకు ట్యాగ్‌లకన్నా, తరతరాలు గుర్తుండిపోయే సినిమాలు చేయడం ముఖ్యం. ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకోవడమే నా లక్ష్యం” అని తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.



అడివి శేష్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రస్తుతం మారిపోయిన ట్రెండ్‌పై ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలుగా వీటిని చాలామంది భావిస్తున్నారు.ఈ మధ్యకాలంలో ఒక హిట్ వస్తే ఒక ట్యాగ్, రెండు హిట్స్ వస్తే మరో బ్రాండ్ అంటూ ముందుకు సాగుతున్న కొందరు తెలుగు హీరోలపై అడివి శేష్ మాటలు కౌంటర్‌లా ఉన్నాయంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. పేరుకే స్టార్‌డమ్ కాకుండా, పని ద్వారా గుర్తింపు రావాలన్న ఆయన ఆలోచనకు నెటిజన్లు కూడా మద్దతు పలుకుతున్నారు.



ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు, “రెండు, మూడు ట్యాగ్‌లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్న హీరోలకు అడివి శేష్ సూటిగా కౌంటర్ ఇచ్చాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం, ఆయన వ్యాఖ్యలు ఎవరికైనా ఉద్దేశించినవేనా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా, ట్యాగ్‌లు, బ్రాండింగ్ కన్నా కంటెంట్‌కి, సినిమాల విలువకే ప్రాధాన్యత ఇస్తున్న అడివి శేష్ ఆలోచన ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక కొత్త చర్చకు తెరలేపిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: