నందమూరి హీరోలకు ఆ ఫ్యాక్టర్ కలిసి రావట్లేదా... ?
నందమూరి వంశం అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్. కానీ, ప్రస్తుత ట్రెండ్‌ను గమనిస్తే ఈ ఫ్యామిలీ హీరోలకు 'సీక్వెల్స్' లేదా 'పార్ట్ 2' అనే సెంటిమెంట్ అస్సలు కలిసి రావడం లేదనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా విడుదలైన 'అఖండ తాండవం 2' ఫలితం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
బోయపాటి - బాలయ్య కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద పూనకాలు ఖాయమని ఫిక్స్ అయ్యారు. 'అఖండ' సృష్టించిన ప్రభంజనంతో, సీక్వెల్‌పై వంద కోట్ల షేర్ అంచనాలు వెలువడ్డాయి. కానీ, థియేటర్లలో పరిస్థితి వేరుగా ఉంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ కు వచ్చిన మిశ్రమ స్పందన ఈ సినిమాకు కలిసొస్తుందని భావించినా, కలెక్షన్లలో ఆశించిన వేగం కనిపించడం లేదు. అద్భుతాలు జరిగితే తప్ప బ్రేక్ ఈవెన్ కావడం కష్టమని ట్రేడ్ వర్గాల అంచనా.
కేవలం బాలయ్య మాత్రమే కాదు, నందమూరి వారసులందరికీ ఈ 'నెంబర్ 2' శాపంలా మారింది. జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ తో కలిసి చేసిన 'వార్ 2' తారక్ కెరీర్‌లోనే ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్, దాని సీక్వెల్ 'బింబిసార 2'ను ఇప్పటికీ పట్టాలెక్కించలేకపోయారు. దర్శకుడు మారినా షూటింగ్ అడుగు ముందుకు పడలేదు. ఇక 'డెవిల్ 2' ఆలోచనను ఆ సినిమా రిజల్ట్ చూశాక విరమించుకోవాల్సి వచ్చింది.
దేవర 2 ఉంటుందా ?
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' మంచి వసూళ్లు రాబట్టినా, 'దేవర 2' భవితవ్యం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. తారక్ పుట్టినరోజున పోస్టర్ రిలీజ్ చేసినా, ఆ తర్వాత టీమ్ నుంచి ఉలుకూ పలుకూ లేదు. ప్రశాంత్ నీల్ సినిమాతో తారక్, ఇతర ప్రాజెక్టులతో కొరటాల బిజీ అయిపోవడంతో ఈ సీక్వెల్ అటకెక్కినట్లేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. దశాబ్ద కాలంగా బాలకృష్ణ కలల ప్రాజెక్టుగా ఉన్న 'ఆదిత్య 369' సీక్వెల్ పరిస్థితి కూడా అంతే. దర్శకుడు క్రిష్ పేరు వినిపించినా, స్క్రిప్ట్ పరంగా గానీ, ప్రొడక్షన్ పరంగా గానీ ఎలాంటి పురోగతి లేదు. మొత్తానికి, నందమూరి హీరోల చుట్టూ అల్లుకున్న ఈ సీక్వెల్ నెగటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి, 'పార్ట్ 2' తో ఘనవిజయం సాధించే ఆ మొనగాడు ఎవరో వేచి చూడాలి.