టాలీవుడ్ సంక్రాంతి 2026 వార్ : సిక్స‌ర్ కొట్టేది ఏ హీరో... ?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీజన్ సంక్రాంతి. ప్రతి ఏటా రెండు మూడు భారీ సినిమాలు పోటీ పడటం ఆనవాయితీ కానీ, ఈ ఏడాది మాత్రం బాక్సాఫీస్ వద్ద యుద్ధం మరింత తీవ్రంగా ఉండబోతోంది. ఏకంగా ఐదుగురు క్రేజీ హీరోలు తమ సినిమాలతో పందెపు కోడిల్లా బరిలోకి దిగుతున్నారు. మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల వరకు అందరూ సంక్రాంతి విజేతగా నిలిచేందుకు పోటీ పడుతున్నారు. ఈ సంక్రాంతి రేసులో అందరి దృష్టి ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రాలపైనే ఉంది.


చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ బాగా అచ్చివచ్చిన సెంటిమెంట్ ఉండటంతో, మెగాస్టార్ తన మార్క్‌ కామెడీతో ఈసారి బాక్సాఫీస్ వద్ద సిక్స్ కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషన్లతో ప్రేక్షకులలో భారీ అంచనాలు కల్పించింది. అలాగే జనవరి 10న విడుదల కానున్న 'ది రాజా సాబ్' ప్రభాస్ కెరీర్‌లోనే మొదటి హారర్ కామెడీ. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం మెగాస్టార్ సినిమా ముందు కొంత ప్రచార వేగం తగ్గినట్లు కనిపిస్తోంది.


ఈ ఇద్దరే కాకుండా మరికొందరు హీరోలు కూడా సంక్రాంతిని టార్గెట్ చేశారు. రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో  ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి ’ తో జనవరి 13న రాబోతున్నారు. నవీన్ పొలిశెట్టి రెండేళ్ల విరామం తర్వాత తన మార్కు కామెడీతో ‘ అనగనగా ఒక రాజు ’ అంటూ జనవరి 14న సందడి చేయనున్నారు. ఫ్యామిలీ డ్రామా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శర్వానంద్ ‘ నారీ నారీ నడుమ మురారీ ’ తో అదే రోజు బరిలోకి దిగుతున్నారు. ఇక తమిళ స్టార్ విజయ్ చివరి సినిమాగా ప్రచారం పొందుతున్న ‘ జననాయకుడు ’ జనవరి 9నే విడుదలై సంక్రాంతి హంగామాను మొదలుపెట్టనుంది.


ముందంజలో మెగాస్టార్ :
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, పక్కా ప్లానింగ్‌తో పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా లెవల్లో ఉన్నా, సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో చిరంజీవి ' మన శంకరవరప్రసాద్ గారు ' టీమ్ పైచేయి సాధిస్తోంది. ది రాజా సాబ్ స్పీడ్ తగ్గడం ఈ సినిమాకు మరింత కలిసొచ్చే అంశం. మొత్తానికి, ఐదు సినిమాల మధ్య జరుగుతున్న ఈ రసవత్తర బాక్సాఫీస్ పోరులో చివరికి ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: