టాలీవుడ్ 2026 సంక్రాంతి వార్‌.. ఆ సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌వా...?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

వచ్చే ఏడాది సంక్రాంతి 2026 బాక్సాఫీస్ వద్ద పెను సంచలనానికి వేదిక కాబోతోంది. టాలీవుడ్ నుంచి ఐదుగురు స్టార్ హీరోలు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో ఈసారి పండగ పోటీ అత్యంత రసవత్తరంగా మారనుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్‌.. ఈ పాన్ ఇండియా హారర్ కామెడీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి రేసులో ముందుగా థియేటర్లను ఆక్రమించేది ఇదే అని తెలుస్తోంది.  మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 12న విడుదల కానుంది. ప్రమోషన్లలో ఈ సినిమా ఇప్పటికే ముందంజలో ఉంది.


భర్త మహాశయులకు విజ్ఞప్తి మాస్ మహారాజా రవితేజ తన శైలికి భిన్నంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న పక్కా ఫ్యామిలీ మూవీ ఇది. జనవరి 13న ప్రేక్షకులను పలకరించనుంది. నారీ నారీ నడుమ మురారి శర్వానంద్ హీరోగా వస్తున్న ఈ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా జనవరి 14న విడుదలవుతోంది. అనగనగ ఒక రాజు యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో జనవరి 14నే బరిలోకి దిగుతున్నాడు.


థియేటర్ల కేటాయింపు..పెద్ద సవాలు :
తెలుగు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా రేసులో ఉండటంతో థియేటర్ల సమస్య మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తోంది. దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న ‘జన నాయకుడు’, శివకార్తికేయన్-సుధా కొంగరల ‘పరాశక్తి’ కూడా సంక్రాంతికే షెడ్యూల్ అయ్యాయి. సంక్రాంతి సీజన్‌లో తెలుగు రాష్ట్రాల్లో లోకల్ సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ప్రభాస్, చిరంజీవి సినిమాలకే అత్యధిక స్క్రీన్స్ కేటాయించే అవకాశం ఉంది. గతంలో జరిగినట్లే, డబ్బింగ్ సినిమాలకు థియేటర్ల సర్దుబాటు కష్టతరంగా మారింది. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కొన్ని థియేటర్లు దక్కినా, బిజీ సెంటర్లు మరియు బి, సి క్లాస్ సెంటర్లలో వీటిని ప్రదర్శించడం దాదాపు అసాధ్యం.


థియేటర్లు దొరకని పక్షంలో, గతంలోలాగే కొన్ని డబ్బింగ్ సినిమాలు లేదా చిన్న సినిమాలు తమ విడుదల తేదీని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఫైన‌ల్‌గా టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ‘వార్’ తప్పేలా లేదు. ప్రభాస్ క్రేజ్, చిరంజీవి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, రవితేజ మార్కు వినోదం.. ఇలా అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఈ మహా యుద్ధంలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: