ఓరేయ్ ఏంట్రా ఇది? మొన్న నిధిని.. నేడు సమంతని..ఇది అభిమానమా..? పైశాచిక ఆనందమా..?
‘ది రాజా సాబ్’ ఈవెంట్‌కు హాజరైన నిధి అగర్వాల్ కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో ఒక్కసారిగా అభిమానులు గుంపుగా చేరి ఆమెను చుట్టుముట్టారు. ఊపిరి తీసుకునే అవకాశమే లేకుండా ఆమెపైకి దూసుకువచ్చి రచ్చ రచ్చ చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు హద్దులు దాటి మిస్‌బిహేవ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. ఒక సెలబ్రిటీగా కాకుండా, ఒక మహిళగా ఆమె ఎదుర్కొన్న ఆ పరిస్థితి ఎంతో ఆందోళన కలిగించే విధంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రముఖ షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమానికి సమంత హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె బయటకు వచ్చి కారువైపు వెళ్లే సమయంలో అక్కడ కూడా ఒక్కసారిగా అభిమానులు గుంపులుగా చేరి అరాచకం సృష్టించారు. సెల్ఫీల కోసం పోటీపడుతూ ఆమె చుట్టూ చేరి, ఆమె చీరను తొక్కుతూ, వ్యక్తిగత స్థలాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. ఈ అనూహ్య పరిస్థితితో సమంత కాసేపు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.
అయినా కూడా సమంత ఎంతో ఓపిక, సహనం ప్రదర్శిస్తూ ఎవరినీ నొప్పించకుండా, చిరాకు దాచుకుంటూ హుందాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె ప్రవర్తనపై చాలామంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటంతో, అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు అభిమానులు ఎక్కువగా ఉండటం సహజమే. కానీ అభిమానం అనే పేరుతో వ్యక్తిగత హద్దులు దాటడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలను అభిమానించడం తప్పు కాదు, కానీ వారి భద్రత, గౌరవం, వ్యక్తిగత స్థలాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి అభిమానికి ఉందని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
కొంతమంది నెటిజన్లు అయితే “ఇది నిజంగా అభిమానమా..? లేక పైశాచిక ఆనందమా..?” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు, భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, అలాగే అభిమానులు కూడా తమ ప్రవర్తనను నియంత్రించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనలాగే మనుషులే అనే విషయం గుర్తుంచుకొని, అభిమానం హద్దుల్లోనే ఉండాలని ఈ సంఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.