పోయి పోయి ప్రభాస్ తో పోటీ పడుతున్నావ్ ఏంటి బాసూ..? శివకార్తికేయన్ బిగ్ రిస్క్ చేస్తున్నాడే..!?
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్స్‌ను ఖరారు చేసుకుని, ప్రమోషన్స్‌ను కూడా మొదలుపెట్టారు. మరోవైపు డబ్బింగ్ సినిమాలు సైతం “మేము కూడా సంక్రాంతి రేసులో ఉన్నాం” అంటూ తమ రిలీజ్ డేట్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఈ పోటీ వాతావరణంలో గెలుపొందడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ మొదటి నుంచే ఆసక్తిని రేపుతోంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవి మోహన్, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తుండగా, శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, పాటలు సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబట్టాయి.
మొదటగా ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే రోజు నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. వీటితో పోలిస్తే శివకార్తికేయన్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదని, కుర్ర హీరోల సినిమాలతో కలిసి పోటీ పడితే మంచి ఫలితం సాధించవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు శివకార్తికేయన్. జనవరి 14 డేట్‌ను వదిలేసి, జనవరి 10న ‘పరాశక్తి’ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు వెల్లడించారు. సినిమా ముందుగా వస్తున్నందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, అదే సమయంలో మరో పెద్ద చర్చ మొదలైంది.
ఎందుకంటే… జనవరి 9న ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ థియేటర్లలోకి రాబోతోంది. అంటే ప్రభాస్ సినిమా విడుదలైన కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే శివకార్తికేయన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ లెక్కన చూస్తే ఇది చిన్న పోటీ కాదు, పూర్తిస్థాయి బాక్సాఫీస్ క్లాష్ అనే చెప్పాలి. డార్లింగ్ ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటే సాధారణంగా ఇతర సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను మార్చుకుంటాయి. అలాంటిది, ప్రభాస్‌తో నేరుగా ఢీకొట్టేందుకు శివకార్తికేయన్ ముందుకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. “వాయిదా వేసుకునే అవకాశం ఉన్నా కూడా ముందుకు రావడం అంటే గెలుపుపై పూర్తి నమ్మకమే” అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు శివకార్తికేయన్ అభిమానులు మాత్రం కంటెంట్ బలంగా ఉంటే స్టార్ పవర్ ఏమాత్రం అడ్డుకాదని అంటున్నారు.
మరి ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో ప్రభాస్ ఆధిపత్యం కొనసాగుతుందా..? లేక శివకార్తికేయన్ తీసుకున్న ఈ బిగ్ రిస్క్ అతనికి బిగ్ రివార్డ్ ఇస్తుందా..? అన్నది జనవరి నెలలో తేలనుంది. ఒకటి మాత్రం ఖాయం… ఈ సంక్రాంతి సినిమా అభిమానులకు థియేటర్లలో ఫుల్ మీల్స్ ఇవ్వబోతోంది.