"ఆ ఇద్దరి హీరోయిన్స్ కోసమే మాట్లాడాను"..సామాన్లు కామెంట్ పై శివాజీ మరో సెన్సేషనల్ స్టేట్మెంట్..!
తాను గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కూడా రాజకీయంగా తీవ్రంగా విమర్శించానని, కానీ ఎప్పుడూ ఈ స్థాయిలో మాటలు ఉపయోగించలేదని గుర్తు చేశారు. అయితే, తాను చెప్పాలనుకున్న అంశం విషయంలో మాత్రం ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, కానీ ఆ సందర్భంలో నోటి నుంచి వచ్చిన రెండు పదాలు మాత్రం పూర్తిగా తప్పని స్పష్టం చేశారు.
శివాజీ మాట్లాడుతూ,“స్త్రీల గౌరవం గురించి చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు లాంటి సీనియర్లు, జర్నలిస్టులు, సమాజంలోని పెద్దలు గతంలో ఎన్నోసార్లు మాట్లాడారు. నేను నిధి అగర్వాల్‌కు జరిగిన సంఘటనను చూసి, సమంతకు జరిగిన విషయాన్ని చూసి స్పందించాను. నా ఉద్దేశం ఎవరికీ ఈ డ్రెస్‌లు వేసుకోండి లేదా వేయొద్దు అని చెప్పడం కాదు” అని అన్నారు.సినిమాల వల్ల సమాజం చెడిపోతుందని భావించే వారికి అవకాశం ఇవ్వకూడదనేదే తన ఆలోచన అని వివరించారు. అయితే, ఆ భావోద్వేగంలో తన నోటి నుంచి అనుకోకుండా రెండు తప్పు పదాలు వచ్చాయని, అది తనకు కూడా తర్వాత అర్థమైందన్నారు. వెంటనే తన భార్యకు, తన కొడుకుకు మెసేజ్‌లు పెట్టి సారీ చెప్పానని, ఈ విషయంపై వీడియో కూడా రికార్డు చేశానని తెలిపారు.
తన వ్యాఖ్యలపై చిన్మయి, అనసూయ వంటి ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తనను ట్యాగ్ చేశారని చెప్పారు. తన ఇంటెన్షన్ ఎప్పటికీ బ్యాడ్ కాదని, ఇప్పటికీ ఆ మాటలు తన నోటి నుంచి ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని అన్నారు. “నేను తప్పు చేశాను. అందుకే క్షమాపణలు చెప్పాను. అది నా బాధ్యత” అని అన్నారు.సుప్రియ తనకు ఫోన్ చేసినప్పుడు కూడా వెంటనే సారీ చెప్పానని తెలిపారు. అయితే ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, మహిళా కమిషన్లను ట్యాగ్ చేస్తూ ఈ విషయం మరింత పెద్దదైందని అన్నారు. “నేను ఎవరితోనైనా మిస్‌బిహేవ్ చేశానా? చేయను కూడా. కానీ ఈ విషయం ఇంతకంటే పెద్ద ఇష్యూ అయ్యే వరకు నా ఇష్యూ ఇలా నడుస్తూనే ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.
ఇక మరోసారి తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని వివరించిన శివాజీ,“ఒకవేళ ఆ రోజు నిధి అగర్వాల్ డ్రెస్ జారితే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఆలోచించాను. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పాలనుకున్నాను. కానీ నా మాటలు తప్పుగా వచ్చాయి. పరిశ్రమలో నాకంటే పెద్ద పదాలు వాడిన వారు లేరా? అయినా నేను మాత్రమే మహిళా కమిషన్‌కు వెళ్లాలా?” అంటూ ప్రశ్నించారు.మొత్తానికి, తన వ్యాఖ్యల విషయంలో తప్పు జరిగినదని అంగీకరిస్తూనే, తన ఉద్దేశం మాత్రం మహిళలను కించపరచడం కాదని, వారి భద్రత, గౌరవం కోసమే మాట్లాడానని నటుడు శివాజీ మరోసారి స్పష్టం చేశారు.