శంబాల మూవీ రివ్యూ.. సీన్ సీన్‌కి వణికించారే

Reddy P Rajasekhar

కథ
శంబాల గ్రామానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంటుంది. అలాంటి ఊర్లో 80వ దశకంలో ఓ ఉల్క ఆకాశం నుంచి పడుతుంది. ఆ ఉల్కని ఊరి జనం బండ భూతం అని పిలుస్తారు. అది పడిన క్షణం నుంచి ఊర్లో రకరకాల ఘటనలు జరుతుంటాయి. రాములు (రవి వర్మ) ఆవు నుంచి పాలకు బదులుగా రక్తం వస్తుంటుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్ని చక్కపెట్టేందుకు, ఆ ఉల్కని పరీక్షించేందుకు విక్రమ్‌ (ఆది)ని ఆ గ్రామానికి ప్రభుత్వం పంపిస్తుంది. విక్రమ్ ఆ ఊరిలోకి వచ్చిన తరువాత జరిగిన ఘటనలు ఏంటి? వరుసగా హత్యలు, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? దేవి (అర్చన ఐయ్యర్) పాత్ర ఏంటి? అసలు శంబాల గ్రామానికి ఉన్న చరిత్ర ఏంటి? ఆ గ్రామ దేవత కథ ఏంటి? మరి ఊర్లో జరిగే వింత ఘటనల్ని ఎలా ఆపారు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
విక్రమ్ పాత్రలో ఆది సాయి కుమార్ ఎంతో సెటిల్డ్‌గా నటించారు. చాలా రోజులకు ఇంటెన్స్ లుక్, పాత్రలో మెప్పించారు. ఆది సాయి కుమార్ తన రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఇందులో కనిపించాడు. యాక్షన్, ఎమోషన్ సీన్లలో ఆది ఎంతో పవర్ ఫుల్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక దేవి కారెక్టర్‌లో అర్చనా ఐయ్యర్ అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ఈ చిత్రంలో రవి వర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్ నటించిన తీరుకు, కనిపించిన విధానానికి ఆడియెన్స్ కచ్చితంగా థ్రిల్ అవుతారు. బేబీ చైత్ర కారెక్టర్ కూడా ఆకట్టుకుంటుంది. స్వాసిక, హర్ష వర్దన్, మధు నందన్, శివ, ప్రియ ఇలా అందరి పాత్రలు మెప్పిస్తాయి. ఏ ఒక్క పాత్ర కూడా ఇందులో అలా వచ్చి ఇలా వెళ్లినట్టుగా అనిపించదు.

విశ్లేషణ
దర్శకుడు యుగంధర్ ముని రాసుకున్న కథకి, బయటకు వదిలిన కంటెంట్‌కి చాలా తేడా ఉంది. టీజర్, ట్రైలర్‌లను బట్టి కథను మాత్రం అస్సలు గెస్ చేయలేరు. థియేటర్‌ లోపలకి వెళ్లి కూర్చున్న ప్రేక్షకుడికి ఎన్నెన్నో కొత్త విషయాల్ని పరిచయం చేసినట్టుగా అనిపిస్తుంది. శంబాల వరల్డ్‌లోకి ఆడియెన్స్‌ని మాత్రం తీసుకెళ్లి అన్ని పాత్రలతో ప్రయాణం చేయిస్తాడు దర్శకుడు. ఇన్ని లేయర్లు ఉన్న కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించడంలో మేకర్‌గా యుగంధర్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

ప్రథమార్దం మొత్తం కూడా శంబాల గ్రామాన్ని పరిచయం చేయడం, ఆ ఊరి చరిత్ర చెప్పడం, ఊరిలోకి సమస్య ఎంటర్ అవ్వడం, ఒక్కో ఘటన అలా జరుగుతూ వెళ్తుంటే.. సీటులో కూర్చున్న ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టించినట్టు అవుతుంది. అలా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఊపిరి బిగపట్టుకుని చూడాల్సిందే. అదిరిపోయేలా ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.

ఇక సెకండాఫ్‌ అంతా కూడా పరిగెడుతూనే ఉంటుంది. సమస్యకు మూలం కనుగొనడం, దానికి పరిష్కారం వెతకడం అంటూ ఇలా హీరో చుట్టూనే అంతా తిరుగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్‌లో రవి వర్మ, మీసాల లక్ష్మణ్ భయపెడితే.. సెకండాఫ్‌లో ఇంద్రనీల్ సీన్లు భయపెడతాయి. అలా ఈ చిత్రంలో కావాల్సనన్నీ హై మూమెంట్స్‌ను దర్శకుడు పెట్టేసుకున్నాడు. క్లైమాక్స్ వరకు ఈ మూవీని గాడి తప్పకుండా తీయడంలో డైరెక్టర్ తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే క్లైమాక్స్ మాత్రం కొందరికి కొంత వీక్ అని కూడా అనిపించొచ్చు.

ఇక టెక్నికల్‌గా చూసుకుంటే శంబాల విషయంలో రియల్ హీరోలుగా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ నిలుస్తారు. ఈ చిత్రానికి విజువల్స్ అదిరిపోయాయి. కేవలం సౌండ్‌తో ఎన్ని రకాలుగా, ఎంతగా భయపెట్టొచ్చే శంబాల నిరూపిస్తుంది. ఆర్ఆర్ ఈ మూవీకి ప్రధాన బలం అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. పాటలు అంతగా గుర్తుండకపోవచ్చు. కానీ మాటలు మాత్రం చాలా వరకు ఆలోచింపజేస్తాయి. ఇక షైనింగ్ పిక్చర్స్ మేకింగ్ క్వాలిటీ, నిర్మాతలు పెట్టిన ఖర్చుకు తగ్గ అవుట్ పుట్ వచ్చింది. మహిధర్, రాజశేఖర్ ఎక్కడా రాజీ పడని మేకింగ్‌తో శంబాలను ఈ స్థాయిలో నిర్మించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఇక ఇలాంటి డిఫరెంట్ జానర్‌లను, కంటెంట్ ఉన్న సినిమాల్ని ఆడియెన్స్ ఆదరిస్తారు. మరి ఈ చిత్రానికి ఎలాంటి కమర్షియల్ విజయాన్ని ప్రేక్షకులు అందిస్తారు? ఏ రేంజ్ హిట్ స్టేటస్‌ను అందిస్తారు? అన్నది చూడాలి.

రేటింగ్ : 3.25/5.0

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: