ఛాంపియన్ మూవీ రివ్యూ & రేటింగ్!

Reddy P Rajasekhar

స్వప్న సినిమాస్ బ్యానర్ పై రోషన్ మేకా హీరోగా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఛాంపియన్ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది.   ఈ సినిమాలో అనస్వర రాజన్  హీరోయిన్ గా నటించగా తెలంగాణ రాష్ట్రంలోని బైరాన్ పల్లి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.  వరుస విజయాలు సాధిస్తున్న స్వప్న సినిమాస్ ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసింది. మేకా రోషన్ ఛాంపియన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఛాంపియన్ గా నిలిచారో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ:

బేకరీలో వర్క్ చేస్తూ జీవనం సాగించే మైఖేల్(మేకా రోషన్) లండన్ లో సెటిల్ కావాలని కలలు కంటాడు. ఫుట్ బాల్ లో ఛాంపియన్ గా నిలిస్తే తన కల నెరవేరుతుందని మైఖేల్ భావిస్తాడు. లండన్ కు వెళ్లే అవకాశం వచ్చిన సమయంలో తండ్రి చేసిన తప్పు వల్ల మైఖేల్ కు  కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకచోట మైఖేల్ తుపాకీలను డెలివరీ చేయాల్సి వస్తుంది. తుపాకీలతో ఉన్న ట్రక్కుతో దారి తప్పిన మైఖేల్  తనకు ఎదురైనా ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాడు? చివరకు తన లక్ష్యాన్ని  సాధించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే  ఈ సినిమా.

విశ్లేషణ:

మేకా రోషన్ ఈ సినిమాలోని మైఖేల్ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఒకింత కాంప్లెక్స్ స్క్రిప్ట్ అయిన ఛాంపియన్ లాంటి బరువైన పాత్రను కెరీర్ తొలినాళ్లలోనే పోషించడం రోషన్ కెరీర్ కు ఎంతో ప్లస్ అవుతుంది.  ఈ పాత్ర కోసం రోషన్ ఎంతో  కష్టపడ్డాడు.  బైరాన్ పల్లి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సీన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరోయిన్ అనస్వర రాజన్ తన నటనతో ఆకట్టుకున్నారు.  రజాకార్ల ఎటాక్ కు సంబంధించిన ఇంటర్వెల్ సీన్ బాగుంది.

దర్శకుడు ప్రదీప్ అద్వైతం కథ, కథనం, డైలాగ్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.  పీరియాడికల్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సీన్స్ తో మొదలైన ఈ సినిమాలో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు.  మూవీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సినిమాలోని కొన్ని హై మూమెంట్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఎమోషనల్ సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా  తెరకెక్కించారు.

ఛాంపియన్ మూవీ విజువల్ గా  అద్భుతంగా ఉంది.  మేకా రోషన్ పవర్ ఫుల్ సినిమాను ఎంచుకుని కెరీర్ పరంగా సరైన మార్గంలో నడుస్తున్నారు.   నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమాలో  నటించి ఆకట్టుకున్నారు.  తెలంగాణ యాసలో రోషన్ చెప్పిన డైలాగ్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి.  రోషన్ అనస్వర రాజన్ కెమిస్ట్రీ బాగుంది.

టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం ఆర్ట్ డిపార్ట్ మెంట్ పడిన కష్టం అంతాఇంతా కాదు. మిక్కీ జే  మేయర్ మ్యూజిక్, బీజీఎమ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. మాదీ  సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ చేశారు.  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  బాగుండేది.  

రేటింగ్ : 3.25/5.0

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: