శంకర వరప్రసాద్ గారు సినిమాతో నయనతార రేర్ రికార్డ్..?
నయనతార సాధారణంగా తన తమిళ సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. కానీ తెలుగు విషయానికి వస్తే భాషా ప్రావీణ్యం మరియు ఉచ్చారణలో తేడాల వల్ల ఆమె ఇప్పటివరకు డబ్బింగ్ చెప్పలేదు. అయితే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్నశంకర వర ప్రసాద్ గారు సినిమా లో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, ఆమె తన సొంత గాత్రాన్నే వినిపించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
నయనతార గొంతులో ఉండే బేస్ మరియు గాంభీర్యం చిరు శంకర వర ప్రసాద్ గారు సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు పదాలను స్పష్టంగా పలికేందుకు ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కెరీర్ మొదట్లో తమిళంలో కూడా నయనతార డబ్బింగ్ చెప్పేది కాదు. అయితే, 2015లో వచ్చిన ‘నానుమ్ రౌడీ దాన్’ (తెలుగులో నేను రౌడీనే) సినిమా నుంచి ఆమె తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఆమె పాత్రలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.
తన మాతృభాష కావడంతో అక్కడ ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. తెలుగులో ఆమె చేసిన ‘తులసి’, ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ వంటి సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గొంతు నయనతారకు బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు నయనతారే స్వయంగా డబ్బింగ్ చెబితే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక స్టార్ హీరోయిన్ తన గొంతును తాను వినిపించినప్పుడు ఆ పాత్రకు మరింత జీవం వస్తుంది. శంకర వర ప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తుండటంతో, ఆమె డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు మరియు నయనతార ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.