"గుర్తు పెట్టుకోండి..ఏదో ఒక్క రోజు ఆ పని చేసి చూపిస్తా"..స్టేజ్ పైనే ప్రామిస్ చేసిన ప్రభాస్..!
తన సినిమాల గురించి పెద్దగా గొప్పలు చెప్పుకోవడం ప్రభాస్‌కు అలవాటు లేదు. “మా సినిమా ఇరగదీస్తుంది”, “రికార్డులు బ్రేక్ చేస్తుంది” వంటి డైలాగులు ఆయన నోట వినిపించడం చాలా అరుదు. అదే సింప్లిసిటీ ఆయనను మిగతా హీరోల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక స్టేజ్ మీద స్పీచుల విషయానికి వస్తే, అవి కూడా ఎక్కువగా రెండు మూడు నిమిషాల్లోనే ముగిసిపోతాయి. మాటలు తక్కువ, భావాలు ఎక్కువ అన్నట్లుగా ఉంటాయి. తన స్పీచులు బోరింగ్‌గా ఉంటాయని ప్రభాసే సరదాగా చెప్పుకోవడం అభిమానులకు తెలిసిన విషయమే.అలాంటి ప్రభాస్ నుంచి ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో వచ్చిన స్పీచ్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈసారి ఆయన సాధారణంగా మాట్లాడినట్టుగా కాకుండా, కాస్త లెంగ్తీగా మాట్లాడాడు. కానీ ఆ లెంగ్త్ ఎక్కడా బోర్ కొట్టించలేదు. తన మాటలతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. స్టేజ్ మీద ఆయన మాట్లాడుతున్నంతసేపూ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపించింది.
ప్రభాస్ స్పీచుల ప్రత్యేకత ఏంటంటే… అందులో ఎలాంటి హడావుడి ఉండదు. అతి ఆర్భాటం ఉండదు. సింపుల్‌గా, సూటిగా, హృదయానికి తాకేలా ఉంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. తన సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే, పండగ సీజన్‌లో విడుదలవుతున్న అన్ని సినిమాల గురించే ఆయన మాట్లాడాడు.“ఈ పండక్కి వచ్చే అన్ని సినిమాలూ బ్లాక్‌బస్టర్లు అవ్వాలి. అందులో మా సినిమా కూడా ఉంటే ఇంకా ఆనందం” అని ఆయన అన్న మాటల్లోని విశాలమైన మనసు అభిమానులను మరింత ఆకట్టుకుంది. తన సినిమా విజయం మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం బాగుండాలని కోరుకునే మనస్తత్వం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.
ముఖ్యంగా సీనియర్ హీరోల గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు తప్పక ప్రస్తావించాల్సినవే. “సీనియర్లు అంటే సీనియర్లే. వాళ్ల నుంచి మేమంతా చాలా నేర్చుకున్నాం. వాళ్ల సినిమాలు కూడా బాగా ఆడాలి” అంటూ ఆయన చెప్పిన మాటలు ఇండస్ట్రీలోని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మరోసారి గుర్తు చేశాయి. తోటి సినిమాలకు, సీనియర్ నటులకు తన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పడం ప్రభాస్ గొప్పతనానికి నిదర్శనం.
ఇక “నా స్పీచులు బోరింగ్‌గా ఉంటాయి. ఏదో ఒక రోజు స్పీచ్ ఇరగదీస్తా” అంటూ చిన్నపిల్లాడిలా నవ్వుతూ మాట్లాడిన తీరు చూస్తే, అభిమానులకు మరింత ముచ్చట వేసింది. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, ఎక్కడా అహంకారం లేకుండా, సింపుల్‌గా మాట్లాడే ప్రభాస్ స్వభావమే ఆయనను కోట్ల మంది అభిమానులకు మరింత దగ్గర చేస్తుంది.స్టేజ్ మీద తక్కువ మాట్లాడినా, మాట్లాడిన ప్రతిసారి తన వ్యక్తిత్వాన్ని, తన మంచి మనసును స్పష్టంగా చూపించే హీరో ప్రభాస్. ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన ఈ స్పీచ్ కూడా ఆయన నిజమైన స్వభావానికి మరో ఉదాహరణగా నిలిచింది. స్టార్‌డమ్ కంటే మనసు పెద్దదిగా ఉండాలి అనే మాటకు ప్రభాస్ సరైన నిర్వచనం అన్నట్టుగా మరోసారి నిరూపించాడు.